నాంపల్లి క్రిమినల్ కోర్టులు, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం క్రిమినల్ కేసు విచారణను బుధవారం చేపట్టిన కోర్టు తదుపరి విచారణను వాయిదావేసింది. ఈ మేరకు ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి శ్రీదేవి.. వచ్చే నెల 4న కోర్టుకు హాజరు కావాలని నోటీసులు జారీచేశారు. కొత్త చట్టం 222 రెడ్‌విత్ 223 బీఎన్ఎస్ఎస్ ప్రకారం ఈ కేసు గురించి ఆమె తరఫున వివరణ ఇచ్చేందుకు కోర్టు అవకాశం కల్పించింది. అక్టోబర్ 2న మీడియా సమావేశంలో ఆమె చేసిన ఆరోపణలు పరువు, ప్రతిష్టకు భంగం కల్గించేలా ఉన్నాయని కేటీఆర్ కోర్టుకు వాంగ్మూలం ఇచ్చారు. ఆమెపై దాఖలైన పిటిషన్‌పై కోర్టుకు వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.
నటుడు నాగార్జున కేసులో..
సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన కే సులో నేడు కోర్టు తీర్పును ప్రకటించనున్నది. ఈ కేసులో సురేఖ తరఫున గుర్మీత్‌సింగ్ హాజరయ్యారు. కోర్టులో ఈ కేసు నిలబడదని న్యాయవాది మీడియాకు తెలిపారు. ఆగస్టు 24న ఎన్-కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేసింద ని, అక్టోబర్ 2న వ్యాఖ్యలు చేసినట్టు ఫిర్యాదు చేశారని ఆమె తరఫున దాఖలు చేసిన కౌంటర్లో వివరించారు.