Ghatkesar | ఘట్కేసర్, జనవరి 6 : ఓ ఆగంతకుడి బ్లాక్‌మెయిల్‌కు భయపడిన ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధి ఘనపూర్ సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో సోమవారం సాయంత్రం జరిగింది. ఇన్స్పెక్టర్ పరశురాం తెలిపిన వివరాలు.. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జమిలాపేట్‌కు చెందిన పర్వతం శ్రీరామ్(25) పోచారం మున్సిపాలిటీ నారపల్లి సమీపంలో సైకిల్ రిపేరింగ్ షాపు నడుపుతున్నాడు. అతనికి అక్కడే ఉంటున్న ఓ బాలికతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.
ఈ విషయం బాలిక బంధువు, మక్త గ్రామానికి చెందిన చింటూకు తెలిసింది.అతను వారిని డబ్బులు ఇవ్వాలని, లేకుంటే ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్తానని బెదిరించాడు. చేసేది లేక శ్రీరామ్ తన దగ్గర ఉన్న రూ.1.35 లక్షలు, బాలిక గోల్డ్రింగ్ ఇచ్చారు. అయినప్పటికీ వదలకపోవడంతో ప్రేమికులిద్దరూ చనిపోదామనుకున్నారు. సోమవారం శ్రీరామ్ తన స్నేహితుడు నవీన్ కారును అడిగి తీసుకొచ్చాడు. అందులో ప్రేమికులిద్దరూ కలిసి సాయంత్రం ఘనపూర్ ఓఆర్ఆర్ వద్దకు వెళ్లి వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను కారులోపల పోసి నిప్పంటించుకున్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు ఇన్స్పెక్టర్ తెలిపారు.