చిగురుమామిడి : పేదలమైన తమకు ఇందిరమ్మ ఇల్లు రాలేదంటూ దంపతులు ఆందోళనకు దిగారు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. భర్త కొద్దిగా పెట్రోల్ తాగడంతో వెంటనే ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరిలో చోటుచేసుకున్నది.
వివరాలు ఇలా.. సుందరగిరి గ్రామానికి చెందిన వంతడుపుల శ్రీనివాస్, సృజన దంపతులు కిరాయి ఇంట్లో ఉంటున్నారు. ఇటీవల ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారుల ఎంపిక జాబితాలో తమ పేరు లేకపోవడంతో మంగళవారం సుందరగిరి చౌరస్తా వద్ద రోడ్డుపై పెట్రోల్ బాటిల్‌తో బైఠాయించారు.
అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. ఆందోళన విరమింపజేసేందుకు స్థానికులు ప్రయత్నించగా శ్రీనివాస్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని.. కొంత పెట్రోల్ తాగాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారుడు శ్రీనివాస్‌ను వెంటనే 108 వాహనంలో హుస్నాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.