హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): సమాఖ్య స్ఫూర్తితో వ్యవహరించాల్సిన కేంద్ర ప్రభుత్వం.. మేము ఇచ్చే వాళ్లం.. మీరు తీసుకొనే వాళ్లు అనే తరహాలో వ్యవహరిస్తున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. బలమైన ప్రజాస్వామ్యానికి బలమైన ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం ఉన్నదని, దీనికి ప్రజలంతా మద్దతు తెలపాలని కోరారు. దక్షిణాది రాష్ర్టాలు దేశ జనాభాలో 19 శాతం ఉంటే, జాతీయ జీడీపీకి 35 శాతం సమకూరుస్తున్నాయని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో దక్షిణ్ డైలాగ్ పేరుతో సౌత్ ఫస్ట్ సంస్థ ‘ఈజ్ ఇండియా ట్రూలీ ఏ ఫెడరల్ స్టేట్’ అంశంపై చర్చ గోష్ఠి నిర్వహించారు. ఈ చర్చలో వివిధ రాష్ర్టాలకు చెందిన ప్రతినిధులు, వివిధరంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. శనివారం జరిగిన తెలంగాణ వజ్రోత్సవాలే ఇందుకు నిదర్శనమని తెలిపారు.
తెలంగాణ వజ్రోత్సవాలను కేంద్రం నిర్వహించాలనుకొన్నప్పుడు రాష్ట్రంతో మాట్లాడి, అభిప్రాయం తీసుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉండేదని, కానీ అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని అన్నారు. ఇది కేంద్ర, రాష్ర్టాలకు సంబంధించిన అంశం తప్ప బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన అంశం కాదని స్పష్టంచేశారు. హైదరాబాద్ రాష్ర్టాన్ని, ప్రజలను భారతదేశంలో కలిపేందుకు ఆనాటి కేంద్ర హోంమంత్రి వచ్చారని, కానీ నేడు ప్రస్తుత కేంద్ర హోంమంత్రి తెలంగాణ ప్రజలను, ప్రభుత్వాన్ని విడగొట్టేందుకు వచ్చారని ఆరోపించారు. దేశానికి కావాల్సింది విభజన రాజకీయాలు కాదని, నిర్ణయాత్మక రాజకీయాలని పేర్కొన్నారు. మేము మీకు కంటే పెద్ద వాళ్లం, మీరు మా కంటే చిన్న వాళ్లు అనే విధానంలో కేంద్రం ఉండటం సరికాదని అభ్యంతరం వ్యక్తంచేశారు.
వ్యక్తులు ప్రధానం కాదు
దేశంలో ఒకప్పుడు ఇండియా అంటే ఇందిర, ఇందిర అంటే ఇండియా అనే విధంగా నడిచిందని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రస్తుతం అదే తరహా విధానమే కొనసాగుతున్నదన్నారు. రాబోయే రోజుల్లో కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ స్థానంలో మోదీ బొమ్మ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి రాష్ట్రానికి వచ్చి, చౌకధరల దుకాణానికి వెళ్లి అక్కడ మోదీ ఫొటో పెట్టలేదని నిలదీశారని, ఆమె స్థాయికి తగ్గట్టు వ్యవహరించలేదని ఆరోపించారు. కేంద్రం పరిధిలో కొన్ని అంశాలు ఉండాలని, కానీ దేశంలో అధ్యక్ష తరహా విధానంలో పనిచేస్తున్నామా? అని అనుమానం వ్యక్తంచేశారు. అత్యవసరమైన, రక్షణ, విదేశీ వ్యవహారాలు, రైల్వే తదితర అంశాలను కేంద్రం తన పరిధిలో ఉంచుకోవాలని, మిగిలిన వాటిని రాష్ర్టాల పరిధిలో ఉంచాలని సూచించారు.
పన్నుల వాటా రావడంలేదు
రాష్ర్టాలకు ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన విధంగా పన్నుల వాటా బదలాయించడంలేదని కేటీఆర్ గుర్తుచేశారు. దక్షిణాది రాష్ర్టాల జనాభా 19% ఉంటే, జీడీపీలో 35% ఉన్నదని వెల్లడించారు. కేంద్ర మంత్రులు మాత్రం ‘మేము ఇస్తున్నాం.. మీరు తీసుకొనే వారు’ అన్న వి ధంగా మాట్లాడుతున్నారని అభ్యంతరం వ్యక్తంచేశారు. తెలంగాణ కేంద్రానికి ఇచ్చే దాంట్లో 46% మాత్రమే తిరిగి వస్తున్నదని తెలిపారు. పన్నుల వాటాలో 29% రాష్ర్టానికి వస్తున్నాయని, 41 శాతం రావాల్సి ఉన్నదని చెప్పారు. జీడీపీ అంటే గుజరాత్ డెవలప్మెంట్ ప్రోగ్రాం గా మారిందని చురకలంటించారు. హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తే అలాంటి దానినే కేంద్రం గుజరాత్లో ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. తెలంగాణ 7-8% వృద్ధి సాధించిందని, సీఏజీఆర్‌లో 15% సాధించిందని తెలిపారు.
ఎన్నో బిల్లులకు మద్దతు తెలిపాం
ప్రధానమంత్రిని, కేంద్రాన్ని తాము పదే పదే ప్రశ్నిస్తున్నామని, నిలదీస్తున్నారని అనుకోవచ్చు, కానీ కేంద్రం ప్రతిపాదించిన అనేక బిల్లులకు పార్లమెంట్లో మద్దతు ఇచ్చామని కేటీఆర్ గుర్తుచేశారు. 45 ఏండ్లలో అత్యధిక ద్రవ్యోల్బణం నమోదయ్యిందని, గత 30 ఏండ్లలో అత్యధిక నిరుద్యోగం ఇప్పుడే ఉన్నదని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఉన్న డిఫెన్స్ పీఎస్‌యూలకు అనుగుణంగా డిఫెన్స్ ఇండస్ట్రీయల్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరితే యూపీలోని బుందేల్ఖడ్లో ఏర్పాటు చేశారని ఆగ్రహించారు. రాజకీయ అంశాల, అవసరాల ఆధారంగా ఇలాంటి వాటిని కేటాయించడంపై చర్చ జరగాలని తెలిపారు.
ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలం
ప్రతిపక్షంగా కాంగ్రెస్ సరైన పాత్ర పోషించడంలేదని కేటీఆర్ అన్నారు. ‘భారత్ జోడో’ యాత్ర చేస్తున్నారని విమర్శించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు నిండాయని, రాబోయే 75 ఏండ్ల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. దేశంలో పేద, మధ్య తరగతి వారికి అవసరమైన సహాయాన్ని అందించి ప్రోత్సహిస్తున్నామని, వీటిపై ప్రధాని ఉచితాలు వద్దు అంటూ మాట్లాడుతున్నారని అభ్యంతరం వ్యక్తంచేశారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుందని స్పష్టంచేశారు. ఎఫ్ఆర్బీఎం 2003 నుంచి ఇప్పటివరకు అనేకసార్లు మార్చారని, కేంద్రం జీడీపీలో 60% అప్పులు చేసిందని, రాష్ట్రం 25% మాత్రమే చేసిందని వివరించారు. 5% జీడీపీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నామని గర్వంగా చెప్తున్నానని తెలిపారు. హైదరాబాద్‌కు వచ్చి బిర్యాని, ఇరానీ ఛాయ్ తాగి పోవచ్చు, కానీ నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు.

పార్టీలను ఏకం చేస్తున్న కేసీఆర్: అసదుద్దీన్
దేశంలోని అనేక రాజకీయ పార్టీలను ఏకం చేయడంలో సీఎం కేసీఆర్ నిమగ్నమై ఉన్నారని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసుదుద్దిన్ ఒవైసీ చెప్పారు. రాష్ర్టాల మధ్య భిన్నత్వం ఉంటుందని, దీనిని కేంద్రం గుర్తించడంలేదన్నారు. విద్యుత్తు సవరణ చట్టం నష్టం చేకూరుస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కు తాము వ్యతిరేకమన్నారు. .
ఉత్తరాదికి దక్షిణాది సబ్సిడీ : శశిథరూర్
దక్షిణాది రాష్ర్టాలు ఉత్తరాదికి సబ్సిడీలు ఇస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ అన్నారు. కర్ణాటక 72% రాష్ట్ర పన్నులను వారి అవసరాలకు ఖర్చు చేస్తుంటే, బీహార్‌లో 23% మాత్రమే ఆదాయం సమకూరుతున్నదని, మిగిలిన మొత్తాన్ని కేంద్రమే భరిస్తున్నదని వివరించారు. పనితీరు బాగాలేని రాష్ర్టాలకే ఎక్కువ నిధులు వెళ్తున్నాయని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. కొన్ని రాష్ర్టాలకే నిధులు ఇస్తూ మిగతా రాష్ర్టాలపై కేంద్రం వివక్ష చూపుతున్నదని తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివెన్ తంగరాజన్ పేర్కొన్నారు. కేంద్రానికి నిధులు రాష్ర్టాల నుంచే వస్తాయనే విషయాన్ని గుర్తించాలని చెప్పారు. కేంద్రానికి ప్రత్యేకంగా నిధులు రానప్పుడు ప్రత్యేక పథకాలు ఏమిటని ప్రశ్నించారు.
ఆయనది సమైక్యత.. ఈయనది బెదిరింపు
తెలంగాణ సమైక్యతా దినోత్సవం సందర్భంగా శనివారం సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రసంగంపై మంత్రి కేటీఆర్ పరోక్షంగా స్పందించారు. ‘74 ఏండ్ల క్రితం నాటి కేంద్ర హోంమంత్రి తెలంగాణ ప్రజలను భారత సమాఖ్యలో కలిపి సమైక్యతను చాటితే, నేటి కేంద్ర హోంమంత్రి తెలంగాణ ప్రజలను, రాష్ట్ర ప్రభుత్వాన్ని విభజించడంతోపాటు బెదిరించేందుకు వచ్చారు. అందుకే దేశానికి విభజనవాద రాజకీయాలు కాకుండా నిర్ణయాత్మక విధానాలు అవసరం’ అని ట్వీట్ చేశారు.
ఆరెస్సెస్‌తో దేశ అస్తిత్వానికి ముప్పు:
ఆర్ఎస్ఎస్ వ్యవహారశైలి, దానిని నిషేధించాల్సిన ఆవశ్యకతపై దేశ తొలి హోంమంత్రి సర్దార్ పటేల్ చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ శనివారం ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఆర్ఎస్ఎస్ గురించి 1948లో సర్దార్ పటేల్ చెప్పిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి ఇది తగిన రోజు అని పేర్కొంటూ.. పటేల్ అన్న మాటలను వెల్లడించారు. ‘వారి (ఆరెస్సెస్) ప్రసంగాలన్నీ మతపరమైన విషంతో నిండి ఉన్నాయి. వారి విషపు ప్రసంగాల తుది ఫలితంగా దేశం అమూల్యమైన గాంధీజీ జీవితాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది’. ‘గాంధీని చంపే కుట్రలో హిందూ మహాసభలోని తీవ్రవాద విభాగం ప్రమేయం ఉందనడంలో సందేహం లేదు. ఆరెస్సెస్ కార్యకలాపాలు ప్రభుత్వం, దేశ అస్తిత్వానికి స్పష్టమైన ముప్పుగా పరిణమించాయి.’ ఆరెస్సెస్‌ను నిషేధిస్తూ సర్దార్ పటేల్ ఈ విధంగా వ్యాఖ్యానించారు అని కేటీఆర్ ట్వీట్ చేశారు.