హైదరాబాద్ : వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల(Graduates MLC election) కౌంటింగ్ సుదీర్ఘంగా కొనసాగనున్నది. నల్లగొండ శివారులోని దుప్పలపల్లి స్టేట్ వేర్‌హౌస్ కార్పొరేషన్ గోదాముల్లో బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటిం గ్ ప్రక్రియలో తొలిరోజు బండిల్స్ కట్టడానికే ఎక్కు సమయం తీసుకున్నది. కాగా, మరోవైపు చెల్లని ఓట్లు అధికారులకు తలనొప్పిగా మారింది.
పట్టభద్రులకు అవగాహన లోపంతో చెల్లని ఓట్లు(Invalid votes) అత్యధికంగా నమోదవుతున్నాయి. చెల్లని ఓట్లు నిర్ధారించే క్రమంలో పలుమార్లు అధికారులు, ఏజెంట్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటున్నది. చెల్లని ఓట్లు అభ్యర్థులతో పోటీ పడుతుంటంతో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమవుతున్నది.
ఇదే సమసయంలో సుదీర్ఘంగా సాగుతున్న లెక్కింపులో ఇప్పటివరకు రెండు రౌండ్లు పూర్తయ్యాయి. 96 వేల మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండు పూర్తయ్యేసరికి తన సమీప అభ్యర్థి రాకేశ్ రెడ్డిపై (బీఆర్ఎస్) 14,672 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. ప్రస్తుతం మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. తొలి రెండు రౌండ్లలో మల్లన్నకు 7,670 ఓట్లు, 7,002 ఓట్ల ఆధిక్యం వచ్చింది.
మొదటి రౌండ్లో మల్లన్నకు 36,210 ఓట్లు రాగా, రాకేశ్ రెడ్డికి 28,540 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 11,395, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 9,109 ఓట్లు పోలయ్యాయి. ఇక మల్లన్నకు రెండో రౌండ్లో 34,575 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 27,573, బీజేపీకి 12,841 ఓట్లు, అశోక్‌కు 11,018 ఓట్లు వచ్చాయి. గురువారం మధ్యాహ్నం తర్వాత ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నది.