చేర్యాల, అక్టోబర్ 12 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి(Mallanna temple) వారి ఆలయ హుండీలను మహా మండపంలో ఆలయ ఈవో ఏ.బాలజీ ఆధ్వర్యంలో దేవాదాయశాఖ సిద్దిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ రంగరావు పర్యవేక్షణలో గురువారం లెక్కింపులు జరిగాయి. ఆలయంలోని 23 హుండీలకు ఆలయ అర్చకులు, ఉద్యోగులు, తాత్కలిక సిబ్బంది, రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన శివరామకృష్ణ భజన మండలి సేవా సమితి సభ్యులతో లెక్కింపులు జరిపారు.
అగస్టు 10వ తేదీ అనంతరం 62 రోజుల లెక్కింపులో రూ.65,18,785 నగదు, 25 గ్రాముల మిశ్రమ బంగారం, 4,500 గ్రాముల మిశ్రమ వెండి సమకూరింది. దీంతో పాటు 11విదేశీ కరెన్సీ నోట్లు, 1000 కిలోల మొక్కుబడి బియ్యం వచ్చింది. ఈ సందర్భంగా ఈవో విలేకరులతో మాట్లాడుతూ.. 62 రోజుల్లో రూ.65,18,785 ఆదాయం వచ్చిందన్నారు.
హుండీలు లెక్తిస్తున్న సిబ్బంది
ఆలయంలోని 23 హుండీల ద్వారా లభించిన నగదును స్థానిక ఏపీజీవీబీలో జమ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవో వైరాగ్యం అంజయ్య, పర్యవేక్షకుడు నీల శేఖర్, ఆలయ స్థానాచార్యుడు పడిగన్నగారి మల్లేశం, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, అర్చకులు, ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.