జమ్మికుంట, ఫిబ్రవరి 20: అధికారంలోకి వచ్చిన రెండు నెలలు పూర్తికాకముందే కాంగ్రెస్ నేతలు దౌర్జన్యాలు మొదలుపెట్టారు. వారి కబ్జాలు, దోపిడీలకు అడ్డువచ్చినవారు ఎవరైనా సరే దాడులు చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని రామన్నపల్లి 3వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్ తన భూ కబ్జాలపై అధికారులకు ఫిర్యాదు చేసిన స్థానిక యువకులపై మంగళవారం ఇనుప రాడ్డుతో విచక్షణారహితంగా దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మేడిపల్లి రవీందర్ ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరాడు. రామన్నపల్లి శివారు సర్వే నంబర్ 422లో ప్రభుత్వ భూమి ఉన్నది. ఈ భూమిని గతంలో కొందరు కబ్జా చేసి ఇంటి నిర్మాణాలు చేపట్టారు. స్థలాలను అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. సర్వే నంబర్ 422 పక్క నే.. పట్టా భూమి సర్వే నంబర్ 407 కూడా ఉన్నది. దీన్ని సాకుగా చూపి ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు.
ఇదే స్థలాన్ని కబ్జా చేసిన కౌన్సిలర్ రవీందర్.. అందులో అక్రమంగా ఇల్లు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ అక్రమాలపై స్థానిక యువకులు కొలకాని రాజు, మర్రి మల్ల య్య (మల్లికార్జున్), మేడిపల్లి రమేశ్ తదితరులు జిల్లా కలెక్టర్, తహసీల్దార్, కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేసిన మున్సిపల్ అధికారులు కొంతభాగం ప్రభుత్వ స్థలమని నివేదిక ఇచ్చారు.
అయితే.. అధికారులెవరూ కౌన్సిలర్‌పై చర్యలు తీసుకోకపోవడంతో మంగళవారం రవీందర్ సదరు స్థలంలో బోరు వేయించేందుకు సిద్ధమయ్యా డు. దీంతో యువకులు అధికారులకు సమాచారమిచ్చారు. అయినా..అధికారులు స్పందించలేదు. దీంతో రెచ్చిపోయిన కౌన్సిలర్.. యువకులను దుర్భాషలాడుతూ ఇనుప రాడ్డుతో రాజు, మల్లయ్య, రమేశ్‌పై దాడిచేశాడు.
రాజు, మల్లయ్యకు తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు వారిని పట్టణంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నదని సమాచారం. దాడి గురించి తెలుసుకున్న హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌జీ జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు.
బాధితులతో మాట్లాడిన ‘పొన్నం’
కౌన్సిలర్ దాడిలో గాయపడిన యువకులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్లో మాట్లాడారు. దాడి చేసిన వ్యక్తులను క్షమించేది లేదని, దాడికి, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలి: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
భూకబ్జాను అడ్డుకున్న యువకులపై కాంగ్రెస్ కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్ దాడి చేయడం హేయమని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. విషయం తెలుసుకుని జమ్మికుంటకు వచ్చిన ఎమ్మెల్యే బాధితులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం దాడులను ప్రోత్సహిస్తున్నదని, ఇలాంటి దాడులను సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అధికారులు ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్‌చేశారు.