హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిలోకి వెళ్లడం రాష్ట్రానికి గొడ్డలి పెట్టులాంటిదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. దీనివల్ల భవిష్యత్‌లో సాగు, తాగునీటికి సమస్య ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి పోకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని చెప్పారు. మంగళవారం ఆయన శాసనమండలిలోని తన చాంబర్లో మీడియాతో చిట్‌చాట్ చేశారు. కేఆర్ఎంబీ నిర్ణయం వల్ల నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో తాగునీటికి సమస్యలొచ్చే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. హైదరాబాద్ నగరానికి కూడా నాగార్జునసాగర్ ద్వారానే తాగునీరు రావాల్సి ఉన్నదని గుర్తుచేశారు. వచ్చే వేసవిలో తాగునీటి సమస్యను అధిగమించడానికి కర్ణాటక నుంచి నీళ్లు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలని సూచించారు.
సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలు అహంకార పూరిత ధోరణిని నిదర్శనమని గుత్తా విమర్శించారు. తాను పార్టీ అధిష్ఠానంపై నారాజ్‌గా ఉన్నట్టు సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాను ఏ పార్టీలోకీ వెళ్లడంలేదని, తాను ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. సోమవారం తమ ఇంటికి కేటీఆర్ వచ్చారని, అది సాధారణ సమావేశమేనని తెలిపారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే తన కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డి భువనగిరి ఎంపీగా పోటీ చేస్తాడని, ఒకవేళ అవకాశం రాకుంటే పార్టీ అభ్యర్థి ఎవరైనా వారి గెలుపు కోసం కృషి చేస్తామని స్పష్టంచేశారు.
నల్లగొండ నుంచి సోనియాగాంధీ పోటీ చేసినా అమిత్‌రెడ్డి వెనకడుగు వేయడని, గతంలో ఇందిరాగాంధీపై తన మామ జైపాల్‌రెడ్డి పోటీ చేశారని, ఇప్పుడు సోనియాగాంధీపై తన కుమారుడు పోటీ చేస్తాడని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఓటమిటికి అనేక కారణాలు ఉన్నాయని వివరించారు. కేసీఆర్‌పై ప్రజల్లో వ్యతిరేకత లేదని, ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలు కాంగ్రెస్‌కు అనుకూలించాయని పేర్కొన్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి పెద్దగా సమయం అవసరంలేదని అన్నారు. నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టుల ప్రభావం తగ్గిందని పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డిపై ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసును ఆ కమిటీకి పంపించామని గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. ప్రివిలెజ్ కమిటీ చైర్మన్‌గా మండలి వైస్‌చైర్మన్ ఉంటారని, కమిటీని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాల్సి ఉన్నదని చెప్పారు. సభను ప్రశాంతంగా, సజావుగా జరపడమే తన ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. అధికార, ప్రతిపక్ష సభ్యులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానని తెలిపారు. వచ్చే బడ్జెట్ సమావేశాలు పాత అసెంబ్లీహాల్లో జరుపుకోవాలని భావిస్తున్నామని, దీనికి అవసరమైన పనులను ఆగాఖాన్ ఫౌండేషన్ చేపడుతున్నదని వివరించారు.