నాగర్కర్నూల్, నవంబర్ 7: తేమసాకు చూపి సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిని నిరసిస్తూ.. గురువారం నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం రాంరెడ్డిపల్లిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించారు. వర్షాలు భారీగా కురవడంతో ఇప్పటికే నష్టాలపాలయ్యామని, చేతికొచ్చిన కొద్దిపాటి పంటను కూడా తేమ సాకు చూపి కొనుగోలు చేయడం లేదని వాపోయారు. రైతుల పంటను కాకుండా దళారులు తెచ్చిన వాటిని కొనడం ఏమిటని నిలదీశారు. రాస్తారోకోతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.