ఆదిలాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): ట్రక్కు డ్రైవర్ల సమ్మె కారణంగా ఆదిలాబాద్‌లో శుక్రవారం పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఫలితంగా రైతులు ఎనిమిది గంటలపాటు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు జరుగుతుండగా శుక్రవారం ఉదయం జిల్లాలోని ఆదిలాబాద్ రూరల్, జైనథ్, బేల, తలమడుగు, తాంసి, భీంపూర్ మండలాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో పత్తిని తీసుకువచ్చారు. ఉదయం 5 నుంచి 10 గంటల వరకు 400 వరకు వాహనాలు వచ్చాయి. సీసీఐ అధికారులు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన పత్తిని బేళ్లుగా మార్చడానికి జిల్లా కేంద్రంలోని 18 జిన్నింగ్‌లను లీజుకు తీసుకున్నారు. ట్రక్కు డ్రైవర్ల సమ్మె కారణంగా జిన్నింగ్ మిల్లులో పత్తి బేళ్ల రవాణా నిలిచిపోయింది.
దీంతో కొనుగోలు చేసిన పత్తిని నిల్వ చేసుకునేందుకు స్థలం లేకపోవడంతో జిన్నింగ్ యజమానులు సీసీఐ కొనుగోలు చేసిన పత్తిని తమ మిల్లుల్లోకి అనుమతించలేదు. ఫలితంగా సీసీఐ అధికారులు కొనుగోళ్లను నిలిపివేశారు. దీంతో పత్తిలోడ్‌తో వచ్చిన వాహనాలు మార్కెట్‌యార్డు లోపల, బయట ఆగిపోయాయి. వందలాది మంది రైతులు పత్తి కొనుగోళ్ల కోసం 8 గంటల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. కొనుగోళ్ల నిలిపివేతను నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోళ్లు నిలిపివేస్తున్నటుట్టు ముందస్తు సమాచారమిస్తే తాము పత్తిని మార్కెట్‌కు తీసుకువచ్చేవాళ్లం కాదని అధికారులను నిలదీశారు. పత్తి కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయల్‌శంకర్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డీఎస్పీ ఉమేందర్ మార్కెట్‌యార్డుకు చేరుకొని జిన్నింగ్ వ్యాపారులు, లారీల యజమానులతో చర్చలు జరిపారు. జిన్నింగ్‌లో ఉన్న పత్తి బేళ్లను రవాణా చేయడానికి లారీ యజమానులు ఒప్పుకోవడంతో మధ్యాహ్నం ఒంటి గంటకు పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.