వరంగల్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రేవంత్రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy) అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా పత్తి (Cotton) వ్యాపారులు రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 6వ తేదీ నుంచి పత్తి కొనుగోళ్లు చేయబోమని అల్టిమేటమ్ జారీచేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు లేఖ రాశారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) అవలంబిస్తున్న అసమతుల్య అలాట్మెంట్, స్లాట్బుకింగ్ విధానాలతో ఎదరువుతున్న సమస్యల గురిం చి ఎన్నిసార్లు చెప్పినా రేవంత్రెడ్డి ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో తామీ నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పష్టంచేసింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మనేని రవీందర్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. రేవంత్రెడ్డి సర్కార్ అనుసరిస్తున్న విధానాలపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని మండిపడుతున్నారు. మార్కెట్కు పత్తిని తీసుకొచ్చాకగానీ, తమకు కిసాన్ కపాస్ యాప్ గురించి తెలియదని కొందరు, ఒకవేళ తెలిసినా తమకు స్మార్ట్ ఫోన్లు లేవని మరికొందరు రైతులు ఆవేదన చెందుతున్నారు.
సీసీఐది ‘విభజించి పాలించు’ వైఖరి
సీసీఐ ‘విభజించు-పాలించు’ విధానాన్ని అవలంబిస్తున్నదని జిన్నింగ్ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. సీసీఐ వర్ టెండర్ ఫైనలైజేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 322 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేసింది. వీటికి పిలువాయి రేటు రూ.1,440గా నిర్ణయించింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో గతంలో జరిగిన సమావేశాల్లో ఎల్-1, ఎల్-2, ఎల్-3క్యాటగిరీలుగా విభజించింది. నిర్దేశిత క్యాటగిరీలవారీగా అలాట్మెంట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా అమలు చేయడంలేదు. దీంతో చాలా మిల్లులు నడవలేని పరిస్థితి. ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు సీసీఐ తమ ఉనికే లేకుండా చేయాలనే దూరదృష్టితో వ్యవహరిస్తున్నాయని, ఇది‘విభజించు-పాలించు’ విధానానికి అద్దంపడుతున్నదని కాటన్ అసోసియేషన్ మండిపడుతున్నది. ప్రభుత్వం తమ మిల్లుల మధ్య ఐక్యత దెబ్బతిని తమ వ్యవస్థ లేకుండా చేయాలనే దీర్ఘకాలిక వ్యూహాన్ని అమలుచేయాలని చూస్తున్నట్టు అనుమానం కలుగుతున్నదని తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి పేర్కొన్నారు.
సమస్యలపై స్పందించని రాష్ట్ర ప్రభుత్వం
పత్తి పంట చేతికొచ్చే సమయంలో కొత్తగా తెచ్చిన ‘కపాస్ కిసాన్ యాప్’తో స్లాట్ బుకింగ్ ప్రవేశపెట్టడం, రైతులందరికీ స్మార్ట్ఫోన్లు లేకపోవడం, రైతులు తమకు అందుబాటులో ఉన్న జిన్నింగ్ మిల్లులుకు స్లాట్బుకింగ్ చేసుకునే సమయంలో డిస్ప్లే కాకపోవడంతో రైతులు అందుబాటులో ఉన్న మిల్లులకు పత్తిని నేరుగా తీసుకొస్తున్నారని, అలా తెచ్చిన పత్తిని కొత్త నిబంధనల ప్రకారం తాము కొనలేకపోతున్నామని కాటన్ అసోసియేషన్ చెప్తున్నది. అకాల వర్షాలతో పత్తిలో తేమ శాతం నిర్దేశించిన దానికంటే ఎకువగా ఉన్నప్పటికీ కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మిల్లుల ముందు రైతులు ధర్నాలు చేస్తున్నారని తెలిపింది. తెలంగాణ నుంచి మద్దతు ధరతో ఎక్కువ పత్తిని కొనుగోలు చేయకుండా సీసీఐ అడ్డంకులు సృష్టిస్తున్నదని పేర్కొన్నది. ఈ సమస్యలను పరిష్కరించాలని గత నెల 30వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా ఫలితం లేకుండా పోయిందని, ఈ నేపథ్యంలోనే తాము ఈ నెల 6వ తేదీ నుంచి పత్తి కొనుగోళ్లను నిరవధికంగా నిలిపివేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు లేఖ రాశామని బొమ్మినేని రవీందర్రెడ్డి తెలిపారు.