మర్రిగూడ, నవంబర్ 12: పత్తి పంట ను ఎలాంటి టార్గెట్ లేకుండా సీసీఐ అధికారులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని పత్తి రైతులు మంగళవారం సాయంత్రం యరగండ్లపల్లిలోని శ్రీలక్ష్మీనర్సింహ స్వామి కాటన్మిల్లు ఎదుట రాస్తారోకో చేశారు. వరసగా మూడురోజుల నుం చి పత్తి కొనుగోళ్లు జరగలేదని, తిండి, నిద్ర లేకుండా సీసీఐ కేంద్రం వద్ద పడిగాపులు గాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. మొన్నటి వరకు తేమశాతం పేరుతో అధికారులు పత్తిని కొనకుండా ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడే మో రోజుకు 1,200 నుంచి 1,500 క్వింటాళ్ల వరకే కొంటామని చెప్పి టార్గెట్ అయిపోయిందంటూ గేటుకు తాళం వేస్తున్నారని వాపోయారు. పత్తిని తీసుకొచ్చిన వాహనాలకు వెయిటింగ్ చార్జీ పడటమే కాకుండా తేమశాతం కూడా పెరిగి తాము తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. వందల మంది రైతుల రాస్తారోకోతో వాహనాలు భారీగా నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ధర్నాను విరమింపజేశారు.