Cotton Farmers | ఆదిలాబాద్, అక్టోబర్25 (నమస్తే తెలంగాణ) : అది ఆదిలాబాద్ మార్కెట్ యార్డు.. శుక్రవారం పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తామని అధికారులు చెప్పడంతో వందలాది మంది రైతులు దాదాపు 300 వాహనాల్లో పత్తిని తీసుకుని వచ్చారు. పత్తి కొనుగోళ్లు ప్రారంభించేందుకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కలెక్టర్ రాజర్షి షా కూడా వచ్చారు. ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి కొనుగోళ్లు ప్రారంభించారు. కలెక్టర్ రాజర్షి షా సమక్షంలో అధికారులు వేలం పాట చేపట్టారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( సీసీఐ) క్వింటాల్‌కు రూ. 7521 ప్రకటించగా ప్రైవేట్ వ్యాపారులు కూడా వేలంలో పాల్గొన్నారు. 8 శాతం తేమతో క్వింటాల్‌కు రూ. 7150 వరకు చెల్లిస్తామని వేలం పాటలో వ్యాపారులు సూచించారు. ఇంతకు మించి చెల్లించేది లేదని తెగేసి చెప్పారు. ధర పెంచాలని కలెక్టర్ సూచించినా వ్యాపారులు ఒప్పుకోలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కలెక్టర్ కోరినా వ్యాపారులు ససేమిరా అన్నారు. దీంతో విసిగిపోయి వెళ్లిపోతుండగా ఓరైతు కలెక్టర్ కాళ్లు పట్టుకుని కాల్మొక్తం సారూ.. పత్తి కొనండి అంటూ బతిమిలాడిన దృశ్యం రైతుల కండ్లలో కన్నీళ్లు తెప్పించింది.
మార్కెట్‌యార్డులో ఒకటో కాంటా వద్ద రైతులు తీసుకువచ్చిన పత్తిలో తేమ శాతాన్ని పరిశీలించగా 19 శాతానికి పైగా వచ్చింది. 12 శాతానికి మించి ఎక్కువ తేమ ఉంటే నిబంధనల ప్రకారం కొనుగోలు చేయడం కుదరదని సీసీఐ అధికారులు సూచించారు. దీంతో సీసీఐ కొనుగోళ్లు సైతం నిలిచిపోయాయి. తేమతో సంబంధం లేకుండా సీసీఐ పంటను కొనాలని రైతులు కోరినా వినలేదు. ధర విషయంలో ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్‌కు రూ. 7150 మాత్రమే చెల్లిస్తామని పట్టు వీడకపోవడంతో ఉదయం 10 గంటలకు ప్రారంభంకావాల్సిన పంట కొనుగోళ్లు రాత్రి 7 గంటలైనా ప్రారంభం కాలేదు.
తేమ ఎక్కువగా ఉందని సీసీఐ కొనుగోళ్లకు నిలిపివేయగా కలెక్టర్ రాజర్షి షా, బోథ్ ఎమ్మె ల్యే అనిల్‌జాదవ్ ప్రైవేట్ వ్యాపారులతో ధర ఎక్కువ చెల్లించాలని సూచించారు. వారు ఒప్పుకోలేదు. కలెక్టర్ మార్కెటింగ్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యాపారులతో మరోసారి చ ర్చలు జరిపారు. వారు చివరకు 8 శాతం తేమతో క్వింటాల్‌కు రూ.7200 చొప్పున కొనుగోలు చేస్తామని సూచించారు. అధికారులు తేమతో సంబంధం లేకుండా క్వింటాల్‌కు రూ.7200 చెల్లించాలని కోరారు. ఇందుకు వారు ఒప్పుకోకపోవడంతో కొనుగోళ్లలో ప్రతిష్టంభన నెలకొన్నది. సాయంత్రం ఆరు గంటల వరకు వ్యాపారులతో కలెక్టర్రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలం చర్చలు జరిపినా ఫలితం రాలేదు.
మధ్యాహ్నం సమయంలో కలెక్టర్ తిరిగివెళ్తుండగా రైతులు వాహనానికి అడ్డంగా నిల్చున్నారు. ఓ రైతు కలెక్టర్ కాళ్లుమెక్కి పత్తి కొనుగోలు చేయాలని కోరాడు. మార్కెట్‌యార్డు ఎ దుట, పాత జాతీయ రహదారి పంజాబ్ చౌక్ వద్ద రాస్తారోకో చేశారు. కాంగ్రెస్ ప్రభుతం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంట కొనుగోళ్లు రాత్రి వరకు జరుగకపోవడంతో వందలాది మంది రైతులు తిండి, తిప్పలు లేక ఇబ్బందులు పడ్డారు.
నేను పది ఎకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి సాగుచేస్తున్నాను. ఎకరాకు రూ. 60వేల పెట్టుబడి అయింది. 40 క్వింటాళ్ల పత్తిని అమ్మడానికి మార్కెట్‌యార్డుకు గురువారం రాత్రి తీసుకువచ్చాను. ఉదయం పత్తి అమ్ముకుని పోదామంటే తేమ ఎక్కువ ఉందని సీసీఐ అధికారులు పంటను కొనుగోలు చేయడం లేదు. ప్రైవేట్ వ్యాపారులు ఇచ్చే రూ.7200 ఏమాత్రం సరిపోదు. క్వింటాలుకు కనీసం రూ.8 వేలు ధర చెల్లించాలి. – దయాకర్ రెడ్డి, రామాయి, ఆదిలాబాద్ రూరల్
పంట మొదటి కోత ప్రారంభంలో సహజంగా తేమశాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో రైతుల తప్పు ఏమున్నది. పంటను ఎండపెట్టి తీసుకువచ్చినా తేమశాతం తగ్గడం లేదు. ఉదయం 6 గంటలకు పత్తిని మార్కెట్‌యార్డుకు తీసుకువచ్చినా సాయంత్రం 6 గంట లు దాటినా కొనుగోలు చేయలేదు. సీసీఐ అధికారులు తేమ 12 శాతం కంటే ఎక్కువ ఉందని పంటను కొంటలేరు. ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధర చెల్లిస్తామంటున్నారు. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. – రవి, పూసాయి, ఆదిలాబాద్ రూరల్