చెన్నూర్ రూరల్, ఫిబ్రవరి 24 : మంచిర్యాల జిల్లా చెన్నూర్ సమీపంలోని కాటన్ జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో సోమవారం పత్తి కొనుగోళ్లు నిలిపివేయడాన్ని నిరసిస్తూ చెన్నూర్-మంచిర్యాల ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేశారు. చెన్నూర్ మార్కెట్ కమిటీ సెక్రటరీ పత్తి కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేస్తున్నాడని ఇటీవల ఆయన్ను జిల్లా అధికారులు సస్పెండ్ చేశారు. ఆ బాధ్యతలను జిల్లా మార్కెటింగ్ అధికారికి అప్పగించారు. డీఎంవో డిజిటల్ సైన్ చేయడం లేదని సీసీఐ అధికారులు రెండు రోజులుగా పత్తి కొనుగోళ్లు నిలిపివేశారు. అధికారుల తీరుకు నిరసనగా వాహనాలను రోడ్డుకు అడ్డంగా పెట్టి రైతులు రెండు గంటలపాటు ధర్నా చేశారు. దళారులు సీసీఐ అధికారులు కుమ్మక్కై ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నా జిల్లా అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. డీఎం వో చేరుకొని డిజిటల్ సైన్ చేస్తానని చెప్పడంతో రైతులు ధర్నా విరమించారు.