హైదరాబాద్, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ): పత్తి రైతుల గోసపై ప్రైవేటు కాటన్ మిల్లర్లకున్న సోయి ప్రభుత్వానికి లేకుండాపోయింది. మద్దతు ధర దక్కక పత్తి రైతుల గోస చూసి ప్రైవేటు వ్యాపారులే చలించిపోయారు. వారికి మద్దతు ధర దక్కేలా చేయాలని కేంద్రానికి విన్నవించారు. ఇందుకోసం తేమ శాతం నిబంధనలను సవరించాలని కోరారు. వాస్తవానికి ప్రభుత్వం, మార్కెటింగ్ శాఖ ఈ పని చేయాలి. కానీ కాంగ్రెస్ సర్కారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నది. పత్తి రైతులకు మద్దతు ధర దక్కేలా చేయడంలో మార్కెటింగ్ శాఖ పూర్తిగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్వింటాలు మద్దతు ధర రూ. 7521 ఉండగా ప్రైవేటు వ్యాపారులు రూ. 5500 నుంచి రూ. 6500లకే కొనుగోలు చేస్తున్నారు.
తేమ శాతం 12 నుంచి 18కి పెంచండి…
మార్కెట్లో పత్తి ధర పతనమవడం, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తేమ పేరుతో కొనుగోలుకు నిరాకరించడంపై రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రైతుల గోసను చూసిన కాటన్ మిల్లర్లు చలించిపోయారు. తేమ శాతం కొర్రీలపై రెండు రోజుల క్రితం కేంద్రానికే లేఖ రాశారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం పత్తిలో తేమ శాతం 8-12 వరకు ఉండాలి. అలా అయితేనే సీసీఐ కొనుగోలు చేస్తుంది. రైతులకు నష్టం జరుగుతున్న దృష్ట్యా తేమ శాతాన్ని పెంచాలని కోరుతూ కేంద్ర టెక్స్టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్కు లేఖ రాశారు. తేమ శాతాన్ని 12 కాకుండా 15 నుంచి 18 వరకు పెంచాలని కోరారు.
తద్వారా రైతులకు మేలు జరుగుతుందని సూచించారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాలతో పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే సీజన్లో పత్తి సాగుపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. నాణ్యమైన పత్తిని అందించే తెలంగాణలో పత్తి సాగు తగ్గితే అది దేశానికే నష్టమని పేర్కొన్నారు. కాబట్టి రైతులకు నష్టం జరగకుండా తేమశాతాన్ని పెంచి మద్దతు ధరకు సీసీఐ ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో సర్కారు తీరుపై పత్తి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర దక్కక తామంతా నష్టపోతుంటే పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కన్నా మిల్లర్లే నయమని విమర్శలు గుప్పిస్తున్నారు.