తలమడుగు, జనవరి 30 : అప్పులబాధతో పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోకంటి సురేశ్ (43) తనకున్న మూడెకరాలతో పాటు మరో పది ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఈ ఏడాది అతివృష్టి కారణంగా పత్తి పంటకు నష్టం వాటిల్లింది.
తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ.1.50 లక్షల పంట రుణంతో పాటు ఇతరుల వద్ద రూ.2 లక్షల అప్పుచేశాడు. రైతు రుణమాఫీ కాకపోవడం, పంటలు పండకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలోనని ఆందోళన చెందాడు. ఈ క్రమంలో శుక్రవారం పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.