హైదరాబాద్, జూన్ 11(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని రెవెన్యూశాఖ బదిలీల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిని అందలం ఎక్కిస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. కిందిస్థాయి అధికారులను క్యాడర్, నిబంధనలకు విరుద్ధంగా పైస్థాయిలో కూర్చోబెట్టడం పరిపాటిగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు నిదర్శనమే.. అవినీతి, అక్రమాల కేసులో జైలుకెళ్లి వచ్చిన ఓ తహసీల్దార్ ఇటీవల బదిలీల్లో జీహెచ్ఎంసీ ఉత్తర భాగంలోని ఓ కీలక ఏరియాకు తహసీల్దార్‌గా రావడం.. నిబంధనలు అతిక్రమించి సొంత జోన్లో కాకుండా మరో జోన్లో పోస్టింగ్ ఇవ్వడం గమనార్హం. ఓ సంఘం నాయకుడిని పట్టుకొని అవినీతి సొమ్ములో కోటి ఖర్చు చేసి పోస్టింగ్ తెచ్చుకున్నట్టు రెవెన్యూశాఖలో చర్చ జరుగుతున్నది. సస్పెండ్ అయిన ఓ అధికారిని రీఇన్స్టేట్మెంట్ చేసిన రోజునే.. ప్రభుత్వం ఆమెకు కీలకమైన జిల్లాలో ఆర్డీవోగా పోస్టింగ్ ఇచ్చింది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. మరోవైపు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాత్రం రెవెన్యూశాఖలో అవినీతికి ఆస్కారం లేదని, అలాంటి వారిని సర్వీస్ నుంచి తొలగిస్తామని ప్రకటనలు చేయడం గమనార్హం.
రెవెన్యూ చరిత్రలోనే తొలిసారిగా ప్రభుత్వం తహసీల్దార్లను డీఆర్వోలుగా నియమించింది. వాస్తవానికి ఈ పోస్టుకు డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు అర్హులు. కానీ రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు మాత్రం ఇవేవి పట్టించుకోకుండా తహసీల్దార్లను కలెక్టర్ తర్వాత స్థానంలో కూర్చోబెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబధించి 12 మంది తహసీల్దార్లను డీఆర్వోలుగా నియమిస్తూ గత నెల 27న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు మండిపడుతున్నారు. జాబ్ చార్ట్, సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా క్యాడర్‌కు అర్హతలేని వారికి ఏ విధంగా పోస్టింగ్ ఇస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
రెవెన్యూశాఖలో ఎవరు ఎక్కువ అవినీతికి పాల్పడితే, ఎవరు అడ్డదారిలో ఎక్కువ సంపాదిస్తే వారిని అందలం ఎక్కించే పనిలో సర్కార్ ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు తాజాగా జరిగిన బదిలీలను ఉదాహరణగా చూపుతున్నారు. ఈ వ్యవహారమంతా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అవుతున్న నేత కనుసన్నల్లోనే జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బదిలీల్లో భాగంగా జోన్-1లో భాగమైన కరీంనగర్ జిల్లాలో పని చేసిన శ్రీనివాస్ అనే తహసీల్దార్ శామీర్‌పేటకు బదిలీ అయ్యారు. ఆయన పోస్టింగ్ వివాదాస్పదమైతున్నది. శామీర్‌పేట్ జోన్-2 పరిధిలో ఉన్నది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా జోన్-1 నుంచి జోన్-2కు బదిలీ చేయడంపై రెవెన్యూశాఖలో చర్చనీయాంశంగా మారింది. శ్రీనివాస్‌పై గతంలో అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. షర్మిల అనే డిప్యూటీ కలెక్టర్‌ను బదిలీల్లో భాగంగా కరీంనగర్ ఆర్డీవోగా నియమించారు. అప్పటి వరకు సస్పెన్షన్‌లో ఉన్న ఆమెను రీఇన్స్టేట్మెంట్ చేసిన రోజే కరీంనగర్ ఆర్డీవోగా పోస్టింగ్ ఇవ్వడం చర్చకు దారితీసింది.
డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు డమ్మీలుగా మారిపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన బదిలీల్లో డిప్యూటీ కలెక్టర్లను సర్కార్ లెక్కచేయకపోవడం రెవెన్యూశాఖలో చర్చకు దారితీసింది. డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు అర్హత, క్యాడర్ ఉన్నప్పటికీ అవసరమైన పోస్టింగ్‌లు దక్కించుకోలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.