హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 11(నమస్తే తెలంగాణ): విద్యుత్తుశాఖలో జరిగే ప్రతీ ఒప్పంద పనిలో కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అధికారులు లంచాలు తీసుకోవడం సహజమే అని ఆరోపణ ఉంది. కానీ ఆ కమీషన్లలో తమకు రావలసినంత రాలేదంటూ నెలరోజులుగా దక్షిణ మండల విద్యుత్తు పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్) అధికారుల మధ్య పంచాయతీ నడుసస్తున్నదని సమాచారం. డిస్కం పరిధిలోని గ్రేటర్ హైదారాబాద్ శివారు ప్రాంతాలతోపాటు మహబూబ్నగర్, వికారాబాద్, నల్గొండ, యాదాద్రి కార్యాలయాల్లో ఇదే గొడవ జరుగుతున్నట్టు తెలుస్తున్నది.
కాంట్రాక్టు పనులను ఆన్లైన్ ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నామని అధికారులు చెప్తున్నప్పటికీ ప్రతీ ఒప్పందానికి ఓ ఫిక్స్డ్రేట్ ఉంటుందని సమాచారం. కాంట్రాక్టర్ నుంచి కమీషన్ వసూలు చేసే బాధ్యతను ఒక ఉద్యోగి లేదా తాత్కాలిక ఉద్యోగి చూస్తారని, వాటిని ఆపరేటర్ల నుంచి ఎస్ఈ స్థాయి అధికారుల వరకు పంచుతారని, ఇది ఎప్పుడూ జరిగే తంతేనని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కానీ ఇటీవల పంపకాల్లో తేడా వచ్చి, వ్యవహారమంతా బెడిసికొట్టిందని సమాచారం.
తాను పెట్టిన సంతకాలెన్ని? వచ్చిన డబ్బులెన్ని? అని లెక్కచూసిన ఓ ఉన్నతాధికారి తన కిందిస్థాయి అధికారితో తనకు తక్కువ డబ్బులు వచ్చాయంటూ చెప్పడంతో గొడవ మొదలైంది. మొదట నల్లగొండ కార్యాలయంలో పంచాయితీ బయటపడగా.. చాలా కార్యాలయాల్లో ఇదే వ్యవహారం నడుస్తున్నట్టు డిస్కం ప్రధాన కార్యాలయంలో చర్చ జరుగుతున్నది. అధికారులు, ఉద్యోగుల లంచాల లొల్లితో డిస్కం పరువు పోతున్నదని ఓ అధికారి శాఖలోని కీలక అధికారి వద్ద వాపోయినట్టు తెలిసింది. దీనిపై అంతర్గత విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని, ఒక్కో జిల్లా కార్యాలయంలో వందలకొద్దీ అగ్రిమెంట్లపై సంతకాలు పెండింగ్లో ఉండటానికి కారణాలేంటని చీఫ్ ఇంజినీర్లు కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం.