Electricity Department | హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు శాఖలో అవినీతి తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా డిస్కంల పరిధిలో చేయి తడపనిదే పనికావడం లేదు. కాసుల దందాకు మరిగిన ఇంజినీర్లు, సిబ్బంది వినియోగదారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. విసుగుచెందిన వినియోగదారులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ను ఆశ్రయిస్తున్నారు. విద్యుత్తు శాఖ కార్యాలయాలపై ఏసీబీ దాడి జరగడం, ఎవరో ఒకరు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటం నిత్యకృత్యమైంది. తాజాగా మంగళవారం మేడ్చల్ -మల్కాగిజిరి జిల్లా ఘట్కేసర్లో ఏఈ బలరాంనాయక్, లైన్‌మ్యాన్ హేమంత్నాయక్ రూ.15 వేల లంచం పుచ్చుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు. ఇటీవలి కాలంలో 10 మందికిపైగా విద్యుత్తు శాఖ ఇంజినీర్లు, సిబ్బందిని ఏసీబీ పట్టుకున్నది.
లక్షణంగా ముడుపులు
విద్యుత్తు ఉద్యోగుల వేతనాలు రూ.లక్షల్లో ఉన్నాయి. అయినా లక్షణంగా ముడుపులు పుచ్చుకుంటున్నారు. డివిజినల్ ఇంజినీర్ (డీఈ) వేతనం రూ.2-4 లక్షలు. కిందిస్థాయి ఉద్యోగుల వేతనాలు సైతం రూ.లక్షకు పైమాటే. అయినా కొందరు ఈ శాఖను అక్రమార్జనకు అడ్డాగా మార్చుకున్నారు. అర్బన్ ప్రాంతాల్లో పోస్టింగ్‌లు, గ్రేటర్ హైదరాబాద్ శివారుల్లోని మేడ్చల్, సైబరాబాద్ సర్కిళ్లల్లో పోస్టింగ్‌లకు పెద్దఎత్తున చేతులు మారుతున్నాయి. హైదరాబాద్ ఇబ్రహీంబాగ్ ఏఈడీ అంబేద్కర్‌పై ఫిర్యాదులు రావడంతో అధికారులు తొలుత సస్పెండ్ చేశారు. రాజకీయ ఒత్తిళ్లతో సస్పెన్షన్‌ను ఎత్తివేసి, మళ్లీ అదే చోట పోస్టింగ్ ఇచ్చారు. ఇదే డివిజన్ పరిధిలోని మరికొందరు ఇంజినీర్లు, సిబ్బందికి నోటీసులిచ్చారు. ఇటీవలి విద్యుత్తు ఇంజినీర్లు, సిబ్బంది బదిలీల్లో ఫోకల్ పోస్టుల్లో పోస్టింగ్‌ల కోసం తీవ్ర లాబీయింగ్ జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోని వారంతా పట్టణ ప్రాంతాల్లో పోస్టింగ్‌లు దక్కించుకున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగులు, సిబ్బంది కొరత ఏర్పడింది.
ఇటీవలీ కాలంలో ఏసీబీకి దొరికినవారు
అవినీతిపై ఫిర్యాదు కేంద్రం
విద్యుత్తు శాఖలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థలో (టీజీఎస్పీడీసీఎల్) ఏకంగా అవినీతి ఫిర్యాదు కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. సంస్థ పరిధిలోని ఇంజినీర్లు, సిబ్బంది లంచం అడిగితే ఫిర్యాదు చేసేందుకు ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. 040-23454884, 76809 01912 రెండు ఫోన్ నంబర్లు ఇవ్వగా, ఈ కేంద్రానికి వచ్చే ఫిర్యాదులను సాక్షాత్తు సీఎండీయే పర్యవేక్షిస్తున్నారు. ‘లంచం ఇవ్వకండి’ అంటూ విద్యుత్తు శాఖ కార్యాలయాల్లో బోర్డులు పెట్టారు. లంచం అడిగితే ఫలానా నంబర్లకు ఫోన్లు చేయాలని పోస్టర్లు అతికించారు. అయినా ఈ ఫిర్యాదుల కేంద్రానికి రోజుకు 10 వరకు ఫోన్‌కాల్స్ వస్తున్నాయంటే పరిస్థితి ఎంతగా అదుపుతప్పిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఫిర్యాదు కేంద్రానికి వచ్చిన కంప్లయింట్ అధారంగా మెదక్ సర్కిల్లోని శివంపేట సెక్షన్ అసిస్టెంట్ దుర్గాప్రసాద్‌ను సస్పెండ్ చేశారు. కొంతమందికి షోకాజ్ నోటీసులు జారీచేశారు.
కలెక్షన్ కింగ్‌లు
విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న కొందరు ఇంజినీర్లు, సిబ్బంది కలెక్షన్ కింగ్లన్న పేరుమోసారు. కొత్త లైన్లు, లైన్ షిప్టింగ్, మీటర్లు, ప్యానల్‌బోర్డులు ఇలా ప్రతి పనికో రేటు! కాంట్రాక్టర్లు, వినియోగదారులు అన్న తేడాలేం ఉండవు. అడిగినంత సమర్పించుకుంటేనే సరి. లేదంటే ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు, కొత్త వెంచర్లలో కనెక్షన్లు కాసుల పంటపండిస్తున్నాయి. సహజంగా ప్రభుత్వ ఉద్యోగులు నేరుగా లంచాలు తీసుకోరని.. బ్రోకర్ల ద్వారా పనులు చక్కబెడతారన్న ప్రచారముంది. కానీ విద్యుత్తుశాఖ ఇందుకు మినహాయింపు, మధ్యవర్తులు, ఏజెంట్లు ఉండరు. ఈ శాఖలోని ఇంజినీర్లు, సిబ్బంది ఏ మాత్రం జంకు లేకుండా నేరుగా పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతున్నది. నిత్యం ఏసీబీ దాడులు జరుగుతున్నా, అవినీతి ఫిర్యాదుల కేంద్రం ఏర్పాటుచేసినా ఇంజినీర్లు, సిబ్బందిలో ఎలాంటి మార్పురాకపోవడం గమనార్హం.