హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏ రంగంలో చూసినా అవినీతి తాండవం చేస్తున్నది. సాధారణంగా రెవెన్యూ, విద్యుత్తు, నీటిపారుదల వంటి శాఖలపైనే అందరి కన్నూ ఉంటుంది. వాటిలో ఏం జరిగినా మీడియా పసిగడుతుంది. మీడియా కండ్లు పడని, ఎవ్వరికీ అనుమానం రాని శాఖల్లో అవినీతి లేదని అనుకుంటే పొరబడినట్టే. రాష్ట్రంలో కార్మిక శాఖ పరిధిలో అవినీతి విశృంఖల నృత్యం చేస్తున్నది. బరితెగించిన దోపిడీకి కార్మిక శాఖ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలకు అవినీతి చెదపట్టింది. అర్హులకు చేరాల్సిన నిధులు కొందరు పెద్దల జేబుల్లోకి చేరుతున్నాయి. ప్ర మాదవశాత్తు మరణించిన కార్మికులకు అందల్సిన బీమా సొమ్ము అప్పనంగా బొక్కుతున్నారు.
ఇది వ్యవస్థీకృతంగా జరుగుతుండటం గమనార్హం.ఇది ఒక అధికారో, బ్రోకరో చేస్తున్న పనికాదు! కార్మిక శాఖకు సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీ ఎంపిక నుంచే దీనికి బీజం పడినట్టు తెలుస్తున్నది. ముక్కూముఖం తెలియని ఓ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం బీమా పథకం అమలు బాధ్యతలు అప్పగించింది. రూ.350 కోట్లను ఇప్పటికే ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించింది. ఆ కంపెనీ ఎంపిక మొదలు ప్రతి అంశం కూడా వివాదాస్పదమే. గతంలోనే ఇన్సూరెన్స్ కంపెనీ అక్రమాల గురించి ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలను ప్రచురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇన్సూరెన్స్ పేరుతో గూడుపుఠానీ జరుగుతున్నదని చెప్పింది. అయినా దీనిపై ఎవరూ దృష్టిపెట్టలేదు. సాక్షాత్తు ప్రభుత్వ పెద్దలే ఈ వ్యవహారంలో తలదూర్చడంతో దీనిపై అడిగే నాథుడే లేకుండా పోయారు.
భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రవేశపెట్టి న బీమా పథకం పెద్దల జేబులు నింపుకోవడానికే సరిపోతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భవన నిర్మాణ కార్మికులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. అకాల మరణం చెందినా ఇది వర్తిస్తుంది. దీంతోపాటు శాశ్వత అంగవైకల్యం కలిగినా వారి కుటుంబానికి ఆస రా అందిస్తారు. 15 లక్షల మందికిపైగా భవన నిర్మాణ కార్మికులు ఈ పథకంలో భాగస్వాములుగా ఉన్నారు. ఒక్కో కార్మికుడు తన వాటా గా రూ.110 సభ్యత్వ రుసుం చెల్లించి ఈ పథకంలో సభ్యుడవుతారు. ఐదేండ్ల కోసారి సభ్య త్వ రెన్యువల్ ఉంటుంది.
ఇలా సభ్యత్వం తీ సుకున్న ప్రతి ఒక్కరికీ కార్డు ఇస్తారు. మరణించిన వారికి రూ.6 లక్షల బీమా సొమ్ముతోపాటు అంత్యక్రియల డబ్బులు కూడా ఇస్తా రు. శాశ్వత అంగవికలురైనవారికి రూ.4 లక్ష లు, వైద్యఖర్చులకు డబ్బులు ఇస్తారు. రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో క్లయిమ్‌లు ఉంటా యి. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. ఆరునెలలుగా ఈ పథకంలో దొంగలు పడ్డారు. ఒకటి కాదు.. రెండు కాదు.. కోట్ల సొమ్మును పక్కదారి పట్టించారు. వంద కోట్ల వరకు కార్మికుల సొమ్ము పక్కదారిపట్టినట్టు తెలుస్తున్నది. ఒక్క బీమా పథకంలోనే సుమారు రూ.150 కోట్లకుపైగా దుర్వినియోగం అయినట్టు విశ్వసనీయ సమాచారం.
ఆవుల నర్సయ్య (తండ్రి పోచన్న) బీఎల్వో రిజిస్ట్రేషన్ నంబర్ ఏఎల్వోఎంఎన్సీఎల్ 1/2009/00883 ప్రమాదంలో మరణించాడని, ఈ మేరకు కార్మిక శాఖకు 2026 ఫిబ్రవరి మూడో తేదీన దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తును కార్మిక శాఖ అధికారులు పరిశీలించి 2026 ఫిబ్రవరి 4న క్లెయిమ్ మంజూరు చేశారు. కేవలం 24 గంటల్లోనే దరఖాస్తు చేయడం, క్లెయిమ్ మంజూరు చేయడం చకచకా జరిగిపోయాయి. ఆవుల నర్సయ్యకు అక్షరాలా రూ.6 లక్షల 30వేల 37 మంజూరయ్యాయి. వీటిని ఆయన కొడుకు ఆవుల రమేశ్ ఖాతాలో వేశారు. ఇది మచ్చుకు ఒక్క ఉదాహరణ. భవన నిర్మాణ కార్మికుల ప్రమాద బీమా పథకం అద్భుతంగా పనిచేస్తూ ఒక్క రోజులోనే క్లెయిమ్ పరిష్కరించారనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఒక్క రోజులోనే దరఖాస్తు పరిష్కరించడం ఆషామాషీ వ్యవహారం కాదు.
దరఖాస్తు పరిశీలన, పోస్టుమార్టం రిపోర్టులు, పంచనామా పత్రాల పరిశీలన, పోలీసు కేసు తదితర అన్నింటినీ ఒక్క రోజులోనే పరిష్కరించడం సాధ్యమేనా? అనేది ఒక ప్రశ్న అయితే.. ఇదే ఆవుల నర్సయ్య కుటుంబంలో ఆయన భార్య ఆవుల లక్ష్మి, కోడలు సునీతకు శాశ్వత అంగవైకల్యం కింద ఒక్కొక్కరికీ రూ.4 లక్షలకుపైగా సొమ్ము జమైంది. ఒకే కుటుంబంలో ఇంత మందికి ఎలా ఇచ్చారు? నిజంగా వీరంతా భవన నిర్మాణ కార్మికులేనా? అనే ప్రశ్న తలెత్తుతున్నది. అయితే, వీరెవ్వరూ భవన నిర్మాణ కార్మికులు కారు. తట్ట ఎత్తలేదు.. పార పట్టలేదు. అయినా వీరి పేర్లతో లక్షలాది సొమ్ము డ్రా చేశారు.
ఆవుల నర్సయ్య కుటుంబంలో మరణించిన నర్సయ్య అసలు సింగరేణి ఉద్యోగి కావడం విస్మయంగొలిపే మరో విషయం. ఆయన సింగరేణి కార్మికుడిగా ఉంటూ గతంలో గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకం కింద ఉద్యోగ విరమణ పొందాడు. ఆయన ప్రమాదవశాత్తు కూడా మరణించలేదు. సహజమరణాన్ని కూడా భవన నిర్మాణ కార్మికుడిగా సృష్టించి సొమ్ము దోచుకున్నారు. భర్తను మంచిర్యాల జిల్లా కింద చూపించారు. ఆయన భార్య, కోడలుది పెద్దపల్లి జిల్లా కింద క్లెయిమ్ చేశారు. ఇలాంటి చిత్ర విచిత్రాలు ఎన్నో ఉన్నాయి.
బీమా సొమ్మును అందించడంలో వేగంగా స్పందిస్తే అనుమానం లేదు. కానీ, మరీ ఒకట్రెండు రోజుల్లోనే దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారం అవుతుండటంపై అనుమానాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో ఈ తరహా కేసులు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం వ్యవహారానికి ఇదే కేంద్రంగా ఉన్నది. ఇక్కడ ఉన్న ఇద్దరు అధికారులు మొత్తం వ్యవహారంలో కీలకంగా ఉన్నట్టు తెలిసింది. వీరికి హైదరాబాద్‌లోని కార్మిక శాఖ కార్యాలయంలో ఉన్న మరో అధికారి అండదండలు పుష్కలంగా ఉన్నాయని చెప్తున్నారు. వీరంతా ముఠాగా ఏర్పడి మంత్రాంగం నడిపిస్తున్నట్టు సమాచారం.
కార్మిక శాఖలో మరో విచిత్రం ఏమిటంటే బీమా సొమ్ము కాజేసేందుకు ఏకంగా ఫేక్ కార్డులు సృష్టిస్తున్నారు. నిర్మాణ రంగంతో సంబంధం లేనివారిని కార్మికులుగా పేర్కొంటున్నారు. పెద్దపల్లికి చెందిన మేకల కుమారస్వామి (కార్డు నంబర్ ఏఎల్వోపీడీపీఎల్1/2014/01111) మ్యారేజీ బ్యూరో నడుపుతాడు. ఈయనకు కార్డు సృష్టించారు. ఈయనకు ప్రమాదం జరిగిందని, శాశ్వత అంగవికలుడయ్యాడని పేర్కొని 2026 జనవరి 29న క్లెయిమ్ కోసం దరఖాస్తు చేశారు. 2026 ఫిబ్రవరి 4న మంజూరైంది. దరఖాస్తు చేసిన అయిదు రోజులకే క్లెయిమ్ క్లియర్ చేశారు. ఈయన చేసే పనికి, ఇచ్చిన కార్డుకు సంబంధంలేదు.
పోనీ ఈయనేమైనా శాశ్వత అంగవికులుడయ్యాడా? అంటే అదీ లేదంటున్నారు స్థానికులు. పెద్దపల్లి జిల్లా రంగాపురానికి చెందిన ఆవుల నర్సయ్య కూడా ఎక్కడా భవన నిర్మాణ కూలీగా పనిచేయలేదు. ఆయన కుమారుడు ఆవుల రమేశ్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా ఉన్నాడు. దీంతో తండ్రి పేరుతో కార్డు పెట్టి ఇన్సూరెన్స్ సొమ్ములు తీసుకున్నాడు. మంథనికి చెందిన చెలికాల యుగంధర్ శాశ్వత అంగవైకల్యం కింద బీమా సొమ్ము రూ.4,05,037 పొందారు. కానీ, ఆయనకేమీ అంగవైకల్యమే లేదని గ్రామస్తులు చెప్తున్నారు. ఇలాంటి ఘటలు కోకొల్లలుగా వెలుగుచూస్తున్నాయి.
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే ఇలాంటి కేసులు అత్యధికంగా ఉండటం గమనార్హం. పెద్దపల్లి ఎంపీగా మంత్రి కుమారుడు ఉండగా తండ్రి చెన్నూరు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారు. మంత్రి సోదరుడు బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరి పరిధిలో ఉన్న మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో బీమా క్లెయిమ్‌లలో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. మంత్రికి తెలిసే జరిగిందా? లేక మంత్రి అనుచరులు ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారా? అనేది విచారణలోనే తేలాల్సి ఉన్నది.
పరకాలకు చెందిన మాదిశెట్టి సరోజన (భర్త సాంబయ్య) కార్డు నంబర్ ఏఎల్వోపీఏఆర్కేఎల్/2019/07350 చనిపోయినందున ఆమె తరఫున 2026 జనవరి 12న క్లెయిమ్ కోసం అప్లికేషన్ పెట్టారు. 24 గంటల్లోపే అది పరిష్కారమైంది. 6 లక్షల 30 వేల 37 రూపాయలు మంజూరు చేశారు. బీమా పరిష్కారం ప్రపంచంలో ఎక్కడా ఇంత వేగంగా అయ్యుండదు. ఒక్క సరోజన విషయంలోనే కాదు..పెద్దపల్లికి చెందిన గుండేటి సాయి కిరణ్, తండ్రి రవీందర్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఈయన కార్డు నంబర్ ఏఎల్వోపీడీపీఎల్ 1/2015/00430. ఈయన మరణించారంటూ 2026 ఫిబ్రవరి 6న దరఖాస్తు చేశారు. దాన్ని కూడా అధికారులు కేవలం 24గంటల్లోపే ప్రాసెస్ చేసి నిధులు విడుదల చేశారు.
ఈయన కుటుంబానికి కూడా ఆరు లక్షల 30 వేల 37 రూపాయలు మంజూరు చేశారు. పరకాలకు చెందిన పీ బాలకృష్ణ, తండ్రి బాలయ్య కార్డు నంబర్ ఏఎల్వోపీఏఆర్కేఎల్ /2023/04383 మరణించారు. ఈయనకు సంబంధించిన దరఖాస్తు 2026 జనవరి 12న కార్మిక శాఖ అధికారులకు చేరింది. దీన్ని అదే రోజు ప్రాసెస్ చేసి బీమా సొమ్ము 6 లక్షల 30వేల 37 విడుదల చేశారు. వరంగల్‌కు చెందిన పరికిరాల రాజన్న, తండ్రి బుచ్చయ్య , కార్డు నంబర్ ఏఎల్వోడబ్ల్యూజీఎల్3/2014/00663 సంబంధించిన దరఖాస్తు 2025 డిసెంబర్ 16న వచ్చింది. మరునాడే ఆమోదించి రూ.6,30,037 మంజూరు చేశారు.
బీమాకు సంబంధించి అధికారుల వద్ద సరైన సమాచారం కూడా ఉండటంలేదు. మంచిర్యాల జిల్లా పరిధిలో 2025 జూన్ ఒకటో తేదీ నుంచి 2026 ఏప్రిల్ 30వ తేదీ మధ్య మరణించిన భవన నిర్మాణ కార్మికుల వివరాలకు సంబంధించి దాఖలైన సమాచార హక్కు చట్టం పిటిషన్‌పై మంచిర్యాల కార్మిక శాఖ అధికారులు స్పందిస్తూ మొత్తం 84 మందికి బీమా మొత్తం ఇచ్చినట్టు చెప్పారు. అయితే, ఈ 84 మందికి సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ బెల్లంపల్లి సమీపంలోని పెద్దనపల్లి సోమగూడేనికి చెందిన కల్వల శరత్ కుమార్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే తమ వద్ద కేవలం పదిమందికి సంబంధించిన వివరాలే ఉన్నాయని, మిగిలిన 74 మంది వివరాలు లేవంటూ అధికారులు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వడం గమనార్హం. ప్రభుత్వం వద్ద ఎవరెవరికి బీమా ప్రయోజనం కల్పించారన్న సమాచారం లేకపోవడం విడ్డూరంగా ఉన్నది. 74 మందికి బీమా సొమ్ము ఇచ్చామని, వారి వివరాలు మాత్రం లేవని అధికారులు చెప్పడం గమనార్హం.