కలెక్టరేట్/ కాప్రా, జూన్ 17: ఏసీబీ వలకు మంగళవారం మరో ముగ్గురు అధికారులు చిక్కారు. ఆయా జిల్లాల ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్‌శాఖలో కొన్నేండ్లుగా ఓ వ్యక్తి తన కారును అద్దెకు తిప్పుతున్నాడు. నెలకు రూ.30వేల చొప్పున పది నెలల బిల్లు పెండింగ్‌లో ఉండగా, నాలుగు నెలల బిల్లు కొద్ది రోజులక్రితం చెల్లించారు. మిగతా 6 నెలల బిల్లు రూ.1.80 లక్షల కోసం సంబంధిత ఏఈ రూ.8వేలు లంచం డిమాండ్ చేశారు. సదరు కారు యజమాని మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్‌కు రూ.8వేలు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఏఈ శరత్ సూచనతోనే తాను డబ్బులు తీసుకున్నట్టు ఎస్ఏ వెల్లడించగా, అక్కడే ఉన్న ఏఈని కూడా అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్కార్యాలయంలో చర్లపల్లి డివిజన్ ఏఈ స్వరూప కాంట్రాక్టర్ నుంచి రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్టు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు. చర్లపల్లి డివిజన్లో సీసీరోడ్డు నిర్మాణానికి సంబంధించి రూ.28.50 లక్షల బిల్లు కాంట్రాక్టర్ రాంరెడ్డికి రావలసి ఉండగా, మొదటి విడతగా రూ.26 లక్షలు చెల్లించారు. మిగతా రూ.2.50 లక్షల బిల్లు చేయాలని సంబంధిత ఏఈఈ స్వరూపను కాంట్రాక్టర్ కోరగా రూ.2లక్షలు లంచం డిమాండ్‌చేశారు. రూ.1.20 లక్షలకు ఒప్పందం కుదరడంతో మంగళవారం కాప్రా సర్కిల్ కార్యాలయం ప్రాంగణంలో ఏఈఈ స్వరూపకు సదరు కాంట్రాక్టర్ ఆ డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.