సోమవారం 25 మే 2020
Telangana - Apr 03, 2020 , 00:13:10

మూడు అడుగులు కాదు.. ముప్పై అడుగులు

మూడు అడుగులు కాదు.. ముప్పై అడుగులు

  • అంత దూరం పాటిస్తేనే కరోనా సోకదు
  • వైరస్‌ గంటలపాటు గాలిలో ఉండే అవకాశం
  • ఎంఐటీ పరిశోధనలో వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ సోకకుండా ఉండాలంటే నిర్ణీత దూరం పాటించాలన్నది అత్యంత కీలకం. అయితే ఇప్పటి వరకు మూడు ఫీట్ల దూరం పాటిస్తే సరిపోతుందని చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే వైరస్‌ బారిన పడిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా అతడి నోటి నుంచి వచ్చే తుంపిర్లు అంతదూరం మాత్రమే ప్రయాణించగలవని వారి అభిప్రాయం. కానీ ఈ మూడు అడుగుల దూరం పాటిస్తే సరిపోదని.. దాదాపు ముప్పై అడుగుల దూరం పాటించాలని అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి (ఎంఐటీ) చెందిన పరిశోధకురాలు డాక్టరు లైడియా బౌరరిబా తాజాగా తెలిపారు. 

తుమ్ము లేదా దగ్గు నుంచి వెలువడే ఏ రకం తుంపర బిందువైనా 23 నుంచి 27 అడుగులు (7 నుంచి 8 మీటర్లు) ప్రయాణించగలదని, తమ వెంట సూక్ష్మ జీవులను కూడా మోసుకెళ్లగలవని ఆమె తమ పరిశోధనలో వెల్లడించారు. నిర్ణీత దూరానికి సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు తుంపర బిందువుల సైజు (పెద్ద లేదా చిన్న) ఆధారంగా రూపొందించారని ఆమె పేర్కొన్నారు. కానీ ఇటీవల జరిపిన పరిశోధనల వల్ల తెలిసిందేమిటంటే.. తుమ్ము, దగ్గు తుంపరలు ఒక చిన్నపాటి మేఘంలాగా వ్యాపిస్తున్నాయని దీంట్లో తుంపర్ల సైజు రకరకాల పరిమాణాల్లో ఉంటున్నాయని చెప్పారు. ఈ మేఘంలో ఉండే గాలి, తేమ కారణంగా తుంపర బిందువులు అంత తొందరగా కూడా ఆవిరి కాకుండా ఉంటాయని ఆమె తెలిపారు. 

దీని వల్లే కరోనా సూక్ష్మ క్రిములు మనం ఊహిస్తున్నదానికన్నా ఎక్కువ సమయం పాటు ఉనికిలో ఉండే ప్రమాదముందని చెప్పారు. కొవిడ్‌-19 వ్యాప్తి నియంత్రణకు అమలు చేస్తున్న నిర్ణీత దూరం విధానాలు 1930 నాటివని చెప్పారు. వీరి పరిశోధన ‘జర్నల్‌ ఆఫ్‌ అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌'లో ప్రచురితమైంది. అయితే ఈ పరిశోధనను అమెరికాకు చెందిన మరో శాస్త్రవేత్త డాక్టర్‌ ఆంథోని ఫౌసి తోసిపుచ్చారు. ఇది పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉన్నదని పేర్కొన్నారు.


logo