Telangana Budget | హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ)/(స్పెషల్ టాస్క్ బ్యూరో): బడ్జెట్ అంటే ఆదాయ వ్యయాల నివేదిక. ప్రజాధ నాన్ని ప్రభుత్వం ఎట్లా ఖర్చుచేయనుందో తెలిపే సమగ్ర నివేదిక. అలాంటి బడ్జెట్ రూపకల్పన అత్యంత పకడ్బందీగా జరగాలి. కానీ, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగ పాఠం ‘చర్విత చరణం’ అన్నట్టుగా ఉంది. చాలా మటుకు పాత బడ్జెట్ నుంచి ఎత్తిపోసినట్టుగా కనిపిస్తోందని, గత ప్రసంగాన్నే మంత్రులు పఠించినట్టుగా అనిపిస్తోందని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. పద్దులను కూడా పాత బడ్జెట్ నుంచి ఎత్తిపోశారేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసాపై నిరుడు బడ్జెట్లో ఎకరాకు రూ.15 వేలిస్తామని, ఇప్పుడేమో రూ.12 వేలే ఇస్తామని చెప్పారు. బడ్జెట్లో ఇలాంటి తప్పిదాలు అనేకం కనిపిస్తున్నాయి.
వెలుగులోకి వచ్చిన కొన్ని తప్పిదాలు
అంకెల గారడీ
పాత బడ్జెట్ నుంచి తీసుకున్న అంకెలను కాంగ్రెస్ ప్రభుత్వం అటూ ఇటూ మార్చి రూ.3,04,965 కోట్లతో తాజా బడ్జెట్‌ను రూపొందించినట్టు కనిపిస్తోందని, నిరుడు జూలై 25న ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ 2024-25 పట్టికను విశ్లేషిస్తే ఈ విషయం అర్థమవుతుందని పలువురు ఆర్థికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. తాజా బడ్జెట్లో కొత్త స్కీమ్‌లు, దార్శనిక నిర్ణయాలు ఏమీ లేవని, దీర్ఘకాలిక వ్యూహాల సంగతే మరిచాచరని, అంకెల గారడీ తప్ప ఈ బడ్జెట్‌కు దశ-దిశ అనేదే లేదని విమర్శిస్తున్నారు.