హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వైద్యవిధాన పరిషత్ (టీవీవీపీ)ని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ (డీఎస్‌హెచ్‌ఎస్)గా మార్చాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) డిమాండ్ చేసింది. డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జీవో 142లో మార్పులు చేయాలని కోరింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశమైన డాక్టర్లు.. వైద్యారోగ్యశాఖలో సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న ఫ్యాకల్టీకి ప్రత్యేక అలవెన్సులు మంజూరు చేయాలని కోరారు. పబ్లిక్‌హెల్త్ విభాగంలోని డాక్టర్లకు నిర్ణీత కాలపరిమితితో ప్రమోషన్లు కల్పించాలని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల్లోకి ప్రొఫెసర్ల బదిలీలను చేపట్టాలని కోరారు. తమ విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించినట్టు టీజీజీడీఏ ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశంలో టీజీజీడీఏ రాష్ట్ర అధ్యక్షుడు నరహరి, సెక్రటరీ జనరల్ లాలుప్రసాద్రాథోడ్, ట్రెజరర్ ఎంకే రవూఫ్, వైస్‌ప్రెసిడెంట్ దీన్‌దయాళ్, జనరల్ సెక్రటరీ సంధ్య పాల్గొన్నారు.