హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో 2012 నుంచి పూజా విధానాలను మార్చడంపై దాఖలైన పిటిషన్ల విచారణార్హతను తేల్చాల్సిన అవసరం ఉన్నదని హైకోర్టు స్పష్టంచేసింది. ఆ తర్వాతే ఈ వ్యవహారంపై ఉత్తర్వులిస్తామని కోర్టు వెల్లడించింది. శ్రీరాముడి కల్యాణం సందర్భంగా సీతారాముల గోత్రనామాలు, వారి ప్రవర చెప్పడం లేదని, వాటిని మార్చడం చెల్లదంటూ 2022లో దాఖలైన పిటిషన్లపై జస్టిస్ సూరేపల్లి నంద సోమవారం మరోసారి విచారించారు. గతంలో ఇదే హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా పిటిషన్ల విచారణార్హతతో పాటు సింగిల్ జడ్జి ఆదేశాల మేరకు నిపుణుల కమిటీ నివేదికను పరిశీలించిన తర్వాతే తగిన ఆదేశాలిస్తామని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ ఈ కేసులో అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారని, ఏజీ హాజరుకు వీలుగా గడువు కావాలని కోరారు. పిటిషన్ల విచారణార్హతపై ఈ నెల 25న ఏజీ వాదనలు వినిపించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆలయ సంప్రదాయాలు, వ్యవస్థాపకుల నిర్దేశించిన మేరకు పూజా విధానాలు ఉండాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోరారు. రాజ్యాంగంలోని 25, 26 అధికరణ ప్రకారం పూజా విధానాల్లో మార్పు లు చేసే వీల్లేదని చెప్పారు. రాజ్యాంగ అధికరణాల ఉల్లంఘన జరిగినపుడు పిటిషన్ విచారణార్హమని తెలుపగా, ఇరుపక్షాల వాదన నిమిత్తం విచారణ ఈ నెల 25కి వాయిదా పడింది.