పొరుగు రాష్ట్రం గోదావరి వరద నీళ్లను వాడుకుంటే తప్పేంటి.. గోదావరి నీళ్లతో కృష్ణా బేసిన్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్ల అంశంపై ముందుగా నన్ను సంప్రదించలేదనే కోపం తప్ప నాకు మరోటి లేదు. ఏపీ సీఎం చంద్రబాబు మమ్మల్ని వదిలి కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లడమే మా అభ్యంతరం. ముందుగా ఒక్కమాట మమ్మల్ని అడిగి ఉంటే బనకచర్ల ఇష్యూ ఇంత దూరం వచ్చేదే కాదు.
– ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి
ఏ సమస్యనైనా చర్చల ద్వారానే పరిషరించుకోవాలన్నది మా విధానం. అనవసర వివాదాలపై మాకు ఆసక్తి లేదు. కృష్ణా, గోదావరి నదులు ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రతో ఎలాంటి సంబంధాలను కోరుకుంటున్నమో ఆంధ్రప్రదేశ్‌తో కూడా అలాంటి సంబంధాలనే కోరుకుంటున్నం. ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రంగా ఉంటే మేం కర్ణాటక, మహారాష్ట్రలకు దిగువన, ఆంధ్ర ప్రదేశ్‌కు ఎగువన ఉన్నం. అందువల్ల ఏపీతో పాటు ఏ రాష్ట్రంతోనూ వివాదాలు కోరుకోవడం లేదు.
– ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణకు ముప్పుగా పరిణమించిన బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వత్తాసు పలుకుతూ మాట్లాడారు. బాబు నోట వచ్చిన మాటలనే రేవంత్ ఉంటంకించారు. అపెక్స్ సమావేశం కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయకుండా చంద్రబాబును చర్చలను ఆహ్వానిస్తామని ప్రకటించారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ బయలుదేరే ముందు మీడియాతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఇప్పుడు ప్రధాని మోదీకి చంద్రబాబు అవసరమని, ఏపీలో ఎన్నికలు గెలిచేందుకు చంద్రబాబుకు గోదావరి జలాలు అవసరమని, తెలంగాణలో పార్టీని బతికించుకోవటానికి బీఆర్ఎస్ వాళ్లకు బనకచర్ల ఇష్యూ అవసరమని వ్యాఖ్యానించారు. నీళ్లు, నిధులు అనేది మోసపూరిత సెంటిమెంట్ అని, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను హేళన చేశారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టింది నిజాం, కాంగ్రెస్ అని, కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు ఏమీ లేవంటూ ద్వేషాన్ని బయటపెట్టుకున్నారు.
భేషజాల్లేవు ..చర్చలకు సిద్ధం
ఇరు రాష్ర్టాలు కూర్చొని మాట్లాడుకుంటే గోదావరి- బనకచర్ల సమస్యకు పరిషారం దొరుకుతుందని, భేషజాలకూ పోకుండా చర్చల ద్వారా పరిషరించుకోవడానికి తాము వెనుకాడటం లేదని రేవంత్ పేర్కొన్నారు. తెలుగు రాష్ర్టాల్లో కొత్త ప్రాజెక్టులు నిర్మించేటప్పుడు విభజన చట్టం ప్రకారం అధికారులు, సాంకేతిక నిపుణులు, మంత్రులు, అపెక్స్ కౌన్సిల్లో చర్చించాల్సి ఉంటుందని.., కానీ ఏపీ సీఎం నేరుగా బనకచర్ల ప్రాజెక్టు ప్రీఫీజిబిలిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం అసలు సమస్యకు కారణమైందన్నారు. ‘ఏపీ విభజన చట్టంలోని అంశాలను పరిషరించుకునేందుకు అధికారులు, మంత్రుల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసినం. ఆయా కమిటీల్లో సమస్యలు చర్చించకుండా చంద్రబాబు నేరుగా కేంద్రం వద్దకు వచ్చారన్నదే మా అభ్యంతరం. ఏపీ తమ ప్రతిపాదనలను ముందుగా తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చి అభిప్రాయం అడిగి ఉంటే ఈ వివాదమే వచ్చేది కాదు’ అని చెప్పారు.
స్వయంగా నేనే పిలుస్తా..
అవసరమైతే తానే ఒక అడుగు ముందుకు వేసి చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తామని రేవంత్ చెప్పారు. 4 రోజులైనా చర్చలు పెడతామని చెప్పుకొచ్చారు. తీసేసిన తహసీల్దార్లు చేసే విమర్శలను తాను పట్టించుకోను అని వ్యాఖ్యానించారు. ‘పక్కనే ఉన్న నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కు ఒక్క మాట కూడా చెప్పకుండా బనకచర్ల మీద చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తామని రేవంత్ ప్రకటించారు. అనంతరం క్యాబినెట్ ప్రస్తావన తీసుకొస్తూ జూన్ 23న క్యాబినెట్ సమావేశంలో చర్చించి, చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తామని ప్రకటించారు. కృష్ణా నదిలో 500 టీఎంసీలకు బ్లాంకెట్ ఎన్వోసీని తాను అడిగినందుకు హరీశ్‌రావు తప్పుపడుతున్నారని తనకుతాను సమాధానపరుచుకునే ప్రయత్నం చేశారు. కాళేశ్వరం ద్వారా 50 వేల ఎకరాలకే నీళ్లు అందించారని, ఏడాదిలో తెలంగాణలో పండిన అత్యధిక పంటలకు కాళేశ్వరం నీళ్లకు సంబంధమే లేదని ద్వేషపూరితంగా మాట్లాడారు.