ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Aug 30, 2020 , 16:40:53

నియంత్రిత సాగు విధానం దేశానికే ఆదర్శం : మంత్రి నిరంజన్ రెడ్డి

నియంత్రిత సాగు విధానం దేశానికే ఆదర్శం : మంత్రి నిరంజన్ రెడ్డి

నారాయణపేట్ : సీఎం కేసీఆర్ సూచించిన నియంత్రిత సాగువిధానం దేశానికే దిక్సూచి అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో రూ. 75 లక్షల వ్యయంతో ఆధునిక రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తెలంగాణలో ఆరేండ్ల పాలనతో వ్యవసాయం లాభసాటి చేశామన్నారు. కరోనా కష్టకాలంలో ఈ దేశాన్ని ఆదుకున్నది వ్యవసాయరంగమే నని పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ అనుకూల విధానాలతో  సాగుకు రైతుల మొగ్గు చూపుతున్నరని వివరించారు.

ఈ రోజు వరకు రాష్ట్రంలో కోటి 35 లక్షల ఎకరాల్లో అన్ని పంటలు సాగుచేశారు. మరో నాలుగు లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందన్నారు. 47 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. దాదాపు 11 లక్షల ఎకరాల్లో కంది సాగుచేసినట్లు వివరించారు. మొక్కజొన్న సాగుచేయొద్దన్న కేసీఆర్ విజ్ఞప్తిని తెలంగాణ రైతాంగం స్వాగతించిందన్నారు.

వ్యవసాయరంగంలో కేసీఆర్ నిర్ణయాలను నాబార్డు స్వాగతించింది. దేశంలో ఈ విధానాలు అమలైతే రైతాంగానికి మేలు జరుగుతుందన్నారు. ఇన్ని ఎకరాలు సాగైనా ఎక్కడా ఎరువుల కొరత రాకుండా వ్యవసాయ శాఖ నుంచి పకడ్బదీగా ప్రణాళికలు అమలు చేశామని పేర్కొన్నారు. 

రాష్ట్రంలో యూరియా కొరత లేదు. రైతులు అనవసరంగా ఆందోళన చెందవద్దన్నారు. ఈ నెలకు సంబంధించి కేంద్రం నుంచి లక్ష 30 వేల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉంది. అయినా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని వెల్లడించారు. వ్యవసాయం లాభసాటి అయితేనే అన్ని వర్గాలకు ఉపాధి దొరుకుతుందన్నారు.

తెలంగాణ ప్రజల ఆశీస్సులతో రాష్ట్రం మరింత పురోగతి సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో నారాయణపేట ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరి చందన, జడ్పీ చైర్మన్ చైర్ పర్సన్ వనజమ్మ, అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి ఉన్నారు.


logo