నాగర్కర్నూల్ : టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా ఎనిమిదేండ్లుగా ప్రభుత్వం అందజేస్తున్న ఆసరా పింఛన్లతో లబ్ధిపొందుతున్న పింఛన్దారులు తమ ఔదర్యాన్ని చాటుతున్నారు. తమకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన జాతీయ పార్టీ బీఆర్ఎస్కు పింఛన్దారులు తమ వంతు బాధ్యతగా ముందుకు వచ్చి భారీ విరాళాలను ప్రకటిస్తున్నారు.
నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం పెద్దురు గ్రామానికి చెందిన ఆసరా పింఛన్దారులు బీఅర్ఎస్ పార్టీకి రూ. 1.01,116 లు అందజేశారు. ఈ సందర్భంగా పింఛన్దారులు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అందించే సమర్ధత, నేర్పు ఉన్న సత్తా ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు. దేశ రాజకీయాలలోనూ కేసీఆర్ సఫలీకృతుడు కావాలని భగవంతుని ప్రార్థిం చారు. దేశాభివృద్ధి , రైతు అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా తామంతా ఆయన వెంటే ఉంటామని బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.
తిమ్మాజీపేట మండలంలో..
నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే సొంత మండలమైన తిమ్మాజీపేట మండలంలో ఇవాళ పింఛన్ దారులు బీఆర్ఎస్ పార్టీకి లక్ష రూపాయలను విరాళంగా అందజేశారు.