హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు వెళ్లే రోడ్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో కొత్త రైల్వేలైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్తోపాటు లైన్ల ఎలక్ట్రిఫికేషన్ పను లు, 40కి పైగా స్టేషన్ల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నట్టు తెలిపారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లిలో రూ.415 కోట్లతో కొత్త టెర్మినల్ నిర్మిస్తున్నట్టు చెప్పారు.
ఈ టెర్మినల్‌కు ప్రయాణికుల రాకపోకల కోసం ఎఫ్‌సీఐ గోదామువైపు 100 అడుగుల రోడ్డు, ఉత్తరం వైపు 80 అడుగుల మార్గం, మహాలక్ష్మినగర్ వైపు మరో 80 అడుగుల రోడ్డు అవసరం ఉన్నట్టు తెలిపారు. ఇండస్ట్రియల్ షెడ్ల ముందున్న రోడ్డును కూడా 80 ఫీట్లకు విస్తరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయించేలా అధికారులను ఆదేశించాలని కిషన్‌రెడ్డి కోరారు. రూ.715 కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులు వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తికానున్నట్టు తెలిపారు. రెతిఫైల్ బస్‌స్టేషన్, అల్ఫాహోటల్ మధ్య ఇరుకు రోడ్డుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ రోడ్డు విస్తరణలోనూ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.