హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ వర్గీకరణ అమలుకు ప్రభుత్వం ఖరారుచేసిన రోస్టర్ పాయింట్లు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నాయని మాల సంఘాల నేతలు, నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తంచే స్తున్నారు. రోస్టర్ పాయింట్లలో ఎస్సీ ‘ఏ’ గ్రూపునకు ప్రాధాన్యం దక్కలేదని, సీ గ్రూపునకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్తున్నారు. ఎస్సీ-బీ గ్రూపునకే లబ్ధి చేకూర్చేవిధంగా రోస్టర్ పాయింట్లను ఖరారు చేసినట్టు ఉన్నదని మండిపడుతున్నారు. ప్రభుత్వం సత్వరమే రోస్టర్ పాయింట్లలో లోపాలను సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పోరుబాట తప్పదని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ షెడ్యూల్డ్ కులాలు (రిజర్వేషన్ల హేతుబద్దీకరణ) చట్టం-2025 పేరిట ఎస్సీ రిజర్వేషన్లను ఏ,బీ,సీ అనే మూడు గ్రూప్‌లుగా విభజించింది. ఏ గ్రూప్‌లో అత్యంత వెనకబడిన 15 ఎస్సీ ఉపకులాలను చేర్చి వారికి 1%, బీ గ్రూప్‌లో మాదిగ తదితర 18 కులాలకు 9%, సీ గ్రూప్‌లో మాల తదితర 26 కులాలకు 5% రిజర్వేషన్లు కల్పించింది. నూతన రోస్టర్ పాయింట్ల ప్రకారం గ్రూప్-ఏలోని కులాలకు 7వ రోస్టర్ పాయింట్‌ను, గ్రూప్-బీ కులాలకు 2,16,27,47,52,66, 72,87,97 రోస్టర్ పాయింట్లను, గ్రూప్-సీలోని కులాలకు 22,41,62,77,91 రోస్టర్ పాయింట్లను కేటాయించింది. ఈ రోస్టర్ పాయింట్ల కేటాయింపుపై మాల సంఘాలు, ఎస్సీ ఉపకులాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి.
బీ-గ్రూప్‌లోని ఎస్సీ కులాలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం ఇష్టారీతిన రోస్టర్ పాయింట్లను ఖరారు చేసిందని ఏ,సీ గ్రూపుల్లోని ఎస్సీ కులాలు విమర్శిస్తున్నాయి. తాజా రోస్టర్ పాయింట్ల ప్రకారం.. ఏవైనా ప్రభుత్వ ఉద్యోగాలను తొలుత గ్రూప్-బీలోని మహిళా అభ్యర్థితో నింపుతారు. అకడ ఆ మేరకు అర్హతలున్న అభ్యర్థి లేకుంటే గ్రూప్-ఏ, ఆ తర్వాత గ్రూప్-సీలోని కులాలతో భర్తీ చేస్తారు. మూడు గ్రూపుల్లోనూ అర్హత కలిగిన అభ్యర్థులు లేకపోతే ఆ ఖాళీలను క్యారీఫార్వర్డ్ చేస్తారు. అయితే, ఈ నిబంధనలు కేవలం గ్రూప్-బీ అభ్యర్థులకు మేలు చేసేందుకే రూపొందించినట్టు ఉన్నదని ఏ,సీ గ్రూపుల్లోని ఎస్సీ కులాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. ఒక గ్రూపులో అర్హతలున్న మహిళా అభ్యర్థి లేకుంటే, అదే గ్రూపునకు సంబంధించిన పురుష అభ్యర్థితో ఆ పోస్టును భర్తీ చేయాలని, ఆ మేరకు అర్హలు లేకుంటే తదుపరి గ్రూపునకు సంబంధించిన అభ్యర్థికి అవకాశం కల్పించాలని కానీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా రోస్టర్ పాయింట్లను ఖరారు చేసిందని మండిపడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి లోపాలను సవరించాలని డిమాండ్ చేస్తున్నారు.. లేదంటే పోరుబాట తప్పదని హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా చేపట్టింది. జాతీయ ఎస్సీ కమిషన్ అభిప్రాయాలను తీసుకోకుండానే చట్టం చేసింది. రోస్టర్ పాయింట్లను కూడా ఒకే గ్రూపునకు లబ్ధి చేకూర్చేలా ఖరారు చేసింది. దీంతో గ్రూప్-ఏ, సీలోని ఎస్సీ కులాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. వారికి ఉన్నతస్థాయి అసిస్టెంట్ ప్రొఫెసర్, గ్రూప్-1 తదితర పోస్టులేవీ దక్కకుండా పోయే ప్రమాదం ఉన్నది. ఈ నేపథ్యంలో ఏ,బీ,సీ క్రమాన్ని అనుసరిస్తూనే రోస్టర్ పాయింట్లను ఖరారుచేయాలి. అందుకు అనుగుణంగా సీ గ్రూపునకు రోస్టర్ పాయింట్లలో 22కు బదులుగా 16వ నంబర్‌ను కల్పించాలి. లేదంటే న్యాయపోరాటం చేస్తాం. -బత్తుల రాంప్రసాద్, మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు