భువనగిరి కలెక్టరేట్, ఆగస్టు 25 : చేపట్టిన అభివృద్ధి పనులకు గాను బిల్లులు చెల్లించాలని కోరుతూ ఓ కాంట్రాక్టర్ యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట బైఠాయించాడు. భార్యా, ఇద్దరు కుమారులతో కలిసి సోమవారం కలెక్టరేట్ ఎదుట టెంట్ వేసుకుని ధర్నాకు దిగాడు. మండలంలోని హన్మాపురం గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు నాగపురి కృష్ణ కొన్నేండ్లుగా కాంట్రాక్టు పననులు చేపడుతున్నాడు. ఈ క్రమంలో హన్మాపురంలో గ్రామ పంచాయతీ భవనం, తాజ్‌పూర్‌లో కురుమ భవనం, అనంతారంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, కుర్మగూడెంలో బీసీ భవనాలు నిర్మాణం చేశాడు. చేపట్టిన పనులకు సంబంధించి రూ.42 లక్షల బిల్లులు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై అనారోగ్యం పాలయ్యాడు. అప్పులు తెచ్చి పనులు చేపడితే కాంగ్రెస్ సర్కార్ వచ్చినంక బిల్లులు చెల్లించక పోవడంతో రోడ్డెక్కాడు. కృష్ణ నిరసనకు పలు పార్టీల నాయకులు సంఘీభావం ప్రకటించారు.