సుల్తాన్‌బజార్, డిసెంబర్ 30 : యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు యూజీసీ పే స్కేల్ అమలుచేయాల్సిందేనని విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అధ్యాపకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డి మాండ్ల సాధనే లక్ష్యంగా కదం తొక్కిన కాంట్రాక్ట్ అధ్యాపకులు.. తమ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు నిరసన విరమించబోమని తేల్చిచెప్పారు. ఈ మేరకు సోమవారం మాసబ్‌ట్యాంక్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను ప్రభుత్వం చిన్నచూపు చూడొద్దని కోరారు.
తమకు ఉద్యోగ భద్రత కల్పించకపోవడంతోపాటు చాలీచాలని వేతనాలు చెల్లిస్తూ ప్రభుత్వం చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టినవిధంగా తక్షణమే యూజీసీ పే స్కేల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాంట్రాక్ట్ అధ్యాపకుల న్యాయమైన సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో అన్ని యూనివర్సిటీలను స్తంభింపజేసేలా నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపేందర్, వేల్పుల, విజయేందర్‌రెడ్డి, పల్లాటి నరేశ్, నవీన్, చిరంజీవి, రేష్మారెడ్డి, కిశోర్, పర్వతాలు, సోమేశ్, మహేశ్వర్‌రెడ్డితోపాటు పెద్దసంఖ్యలో కాంట్రాక్ట్ అధ్యాపకులు పాల్గొన్నారు.