కరీంనగర్, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ అభివృద్ధి పనులకు మంజూరు చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఖర్చు చేయడంలేదని కేంద్ర గృహ నిర్మాణ, విద్యుత్తు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి కోసం రూ.లక్షల కోట్ల నిధులు ఇస్తున్నామని, వీటిని సకాలంలో ఖర్చు చేసి యుటిలైజెషన్ (యూసీ) సర్టిఫికెట్ ఇవ్వక పోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతున్నాయని తెలిపారు. శుక్రవారం కరీంనగర్లో ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి 24 గంటల నీటి సరఫరాతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల్ జీవన్ విషన్ కింద ఇప్పటికే 74 శాతం గృహాలకు స్వచ్ఛమైన నీరు అందుబాటులోకి వచ్చిందని, దేశ వ్యాప్తంగా 12 కోట్ల ఇండ్లకు నీటి కనెక్షన్లు ఇవ్వగా తెలంగాణలో 38.30 లక్షల ఇండ్లకు ఇచ్చినట్టు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా కోటి ఇండ్లు నిర్మిస్తున్నామని, ఇందులో తెలంగాణకు రావాల్సిన వాటా కంటే ఎక్కువ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో కరీంనగర్‌ను అభివృద్ధి పథంలో నడిపించానని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్లో నిరంతర నీటి సరఫరా తన చేతుల మీదుగా ప్రారంభంకావడం తన అదృష్టమని చెప్పారు. మానేరు రివర్‌ఫ్రంట్‌కు అవసరమైన 300 కోట్ల నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రికి వినతిపత్రం ఇచ్చారు.