Congress Govt | హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇప్పుడంతా నిఘా రాజ్యం నడుస్తున్నది. మంత్రులు, కీలక నేతలపై నిరంతర నిఘా కొనసాగుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా కొందరు మంత్రుల కదలికలను తెలుసుకునేందుకు పోలీసు శాఖలోని నిఘా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక దళాన్ని నియమించినట్టు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నది. కీలక పోస్టుల్లో ఉన్న అధికారుల కదలికలనూ నిరంతరం గమనిస్తున్నారని తెలుస్తున్నది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో తమ ప్రభుత్వంలో మంత్రులపై, అధికారపార్టీ ఎమ్మెల్యేలపై నిఘానే ఉండదని, ఎల్లడలా స్వేచ్ఛ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యిందని పలువురు కాంగ్రెస్ నేతలు సన్నిహితుల వద్ద వాపోతున్నారు. గడిచిన రెండు నెలలుగా తెరపైకి వచ్చిన వివిధ అంశాల నేపథ్యంలో మంత్రులపై నిఘా మరింత పెరిగిందని చెప్తున్నారు. ఆ మంత్రులు హైదరాబాద్‌లోనో.. వారికి సంబంధించిన నియోజకవర్గంలోనో ఉన్నపుడే కాదు, వాళ్లు ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా ఈ నిఘా కొనసాగుతున్నదని సమాచారం. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కొన్నిరోజులు ఎలాంటి నిఘా లేకుండా చూశారు. కానీ, తర్వాత క్రమంగా నిఘా పెరుగుతూ వచ్చింది. మొదట్లో ఒకరిద్దరు మంత్రులపైనే కొన్ని అంశాలను కేంద్రీకరించి నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరించేవారు. ఆ తర్వాత దాన్ని విసృ్తతపరిచారు. ఒకరి నుంచి ఇప్పుడు సుమారు ఆరుగురు మంత్రులపై నిఘా గట్టిగానే పెట్టినట్టు తెల్సింది. మంత్రులే కాదు.. పాత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన మాజీ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీకి సన్నిహితంగా ఉండే అధికారులపై కూడా సర్వేలైన్స్ కొనసాగుతున్నదని సమాచారం.
కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏమైనా మాట్లాడాలంటే ‘ఐఫోన్ ఉందా’ అని అడుగుతున్నారు. ‘ఏం చెప్తామన్నా.. మాపైన కూడా నిఘా మొదలైంది. ఇదేం పద్ధతి?’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఎవరితోనైనా మాట్లాడాలంటే ఐఫోన్‌లోని ఫేస్‌టైమ్ యాప్ ద్వారా మాట్లాడాల్సి వస్తున్నది. అది కూడా ‘నిఘా’ వర్గాలు తెలుసుకోవచ్చుగానీ, కొంతలో కొంత సేఫ్‌గా ఉంటదని వాడుతున్నం. ఏదో మాట్లాడిండ్రని అంటున్నరు.. ఏం మాట్లాడినమో తెలుస్తలేదని అంటున్నరు. ఇదేదో మంచిగనే ఉన్నదని ఫేస్‌టైమ్‌లోనే మాట్లాడుకుంటున్నం’ అని వారు చెప్తున్నారు. సిగ్నల్, వాట్సాప్ యాప్‌లపైనా నిఘా పెట్టి మనం ఎవరెవరితో మాట్లాడుతున్నామో ఆరా తీస్తున్నారని వాపోతున్నారు. ‘అన్నా.. మొన్న నువ్వు ఫలానా ఆయనతో ఇట్ల అన్నవంట.. అది అట్ల కాదు’ అని ఒక నేతను ఉద్దేశించి ముఖ్యనేత ఒకరు వ్యాఖ్యానించినట్టు తెలిసింది. తాను మాట్లాడిన విషయం తనకు, ఎదుటివ్యక్తికి తప్ప మరొకరికి తెలియదని, అలాంటిది ఇట్లా అనడం దేనికి సంకేతమని ఆ నేత వాపోతున్నాడు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ఓ నిఘా అధికారి దృష్టికి కూడా తీసుకెళ్లగా.. ఆయన ఒక నవ్వు నవ్వి.. ‘అది నా డ్యూటీయే కదన్నా. మీకు తెలియనది కాదుకదా’ అని అన్నట్టు తెలిసింది.
రాష్ట్ర నిఘా అధికారులకు ఇప్పుడు ఢిల్లీలో చేతినిండా పని దొరికింది. పార్టీ అధిష్ఠానం వద్దకు ఎవరెవరు వెళ్తున్నారు.. ఎవరెవరు ఎవరిని కలుస్తున్నారనే దానిపై ఎక్కువ దృష్టిపెడుతున్నట్టు తెలిసింది. ఇటీవల ఒక కీలక మంత్రి ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై ఆయన అధిష్ఠానానికి నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగా అధిష్ఠానం పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డిలకు సంబంధించిన నామినేటెడ్ పదవులను ఆపేసింది. ఈ విషయం నిఘా వర్గాల ద్వారా ముందే పసిగట్టిన ముఖ్యనేత హడావుడిగా ఢిల్లీకి వెళ్లి తన వాదన వినిపించే ప్రయత్నం చేశారు. అధిష్ఠానం తనకు ఇలాంటి విషయంలో సహకరించాలని, అయితేనే పార్టీని బలోపేతం చేయగలనని ఆయన చెప్పినట్టు తెలిసింది. ఢిల్లీ పెద్దల్లో కీలకమైన కేసీ వేణుగోపాల్‌ను కలిసి తన పరువుపోతున్నదని కూడా అన్నట్టు సమాచారం. అయితే, అధిష్ఠానం ఆ ముఖ్యనేతను పట్టించుకోలేదు.
ఫలానా నాయకుడు.. ఫలానా అంశంపై పార్టీ అధిష్ఠానం వద్దకు వెళ్తున్నాడంటూ నిఘా వర్గాల నుంచి సమాచారం అందగానే.. తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై మీడియా, సోషల్ మీడియాలో సదరు ముఖ్యనేత కథనాలను రాయిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ విషయంలో పార్టీ నేతలు ఆయనపై గుర్రుగా ఉన్నారు. కొంతమంది పార్టీ నేతలకు వ్యతిరేకంగా గతంలోనూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించిన చరిత్ర ఆ ముఖ్యనేతకు ఉన్నది. తనను కాదని ఎవరైనా ఢిల్లీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నిస్తే.. రెండు కండ్ల సిద్ధాంతంతో పనిచేసే ఓ మీడియా సంస్థకు చెందిన పత్రిక, టీవీ చానల్లో ఆ మంత్రి లేదా ఆ నేతకు వ్యతిరేకంగా కథనాలు వచ్చేస్తాయి. సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలవుతుంది. విషయం ఆ మంత్రి లేదా ఆ నేతకు అర్థమయ్యేలా చేస్తారు. ఒకరిద్దరు కీలక మంత్రులు ఈ విషయాన్ని కూడా పార్టీ అధిష్ఠానం వద్దకు తీసుకెళ్లారని, తమపై వస్తున్న పత్రికల కథనాలు, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై వారు తమ నిరసన తెలిపారని గాంధీభవన్ వర్గాల సమాచారం.