గద్వాల: ఎగువన కృష్ణ బేసిన్లో కురుస్తున్న భారీ వర్షాలకు జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) భారీ వరద కొనసాగుతున్నది. బుధవారం 95,119 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు డ్యాం 12 గేట్లను తెరిచారు. దిగువకు మొత్తం 96,172 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో స్పిల్వే ద్వారా 63,696 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తికి 30,422 క్యూసెక్కులుగా ఉన్నది. డ్యాం పూర్తిస్థాయి సామర్థ్యం 9.657టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.010 టీఎంసీల నిల్వ ఉన్నాయి.
ఇక దిగువన ఉన్న శ్రీశైలానికి భారీగా వరద వస్తున్నది. జూరాల ప్రాజెక్టు నుంచి 1.02 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను 861.70 అడుగుల వద్ద ఉన్నది. అదేవిధంగా ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ 215.8 టీఎంసీలు. ప్రస్తుతం 111.40 టీఎంసీలుగా నమోదైంది.