(స్పెషల్ టాస్క్ బ్యూరో), హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లాలో 13 మంది ఉపాధ్యాయులను టీచర్ల సర్దుబాటులో మరో పాఠశాలకు వెళ్లకుండా ఉపాధ్యాయ సంఘాలు చక్రం తిప్పాయి. పలుకుబడి కలిగిన ఉపాధ్యాయ సంఘం నేతలు ఈ 13 మంది టీచర్లను మరోచోటికి కదలకుండా నిలువరించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇలాంటి వింతలు, విచిత్రాలు బోలెడు జరిగినట్టు విద్యాశాఖలో ప్రచారం జరుగుతున్నది. మిగులు టీచర్ల సర్దుబాటు ప్రక్రియలో పైరవీలు.. రాజకీయ ఒత్తిడులు పనిచేశాయి. ఉపాధ్యాయ సంఘాలు చక్రం తిప్పాయి. ఇక డీఈవోలు సంఘాల నేతలు చెప్పినట్టు తలూపారు. దీంతో సర్దుబాటులో పైరవీల రాజ్యం.. సంఘాల భోజ్యం అన్నట్టుగా తయారయ్యింది. అనేకానేక ఉల్లంఘనలు వెలుగుచూశాయి.
రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని అనుసరించి మిగులు టీచర్ల సర్దుబాటుకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. నిబంధనల ప్రకారం ప్రాథమిక పాఠశాలలో 10 మంది విద్యార్థులకు ఒక టీచర్, 11 నుంచి 60 మంది విద్యార్థులకు ఇద్దరు టీచర్లు, 61-90లోపు విద్యార్థులుంటే ముగ్గురు టీచర్లుండాలి. కానీ సర్దుబాటు తర్వాత 51 మంది విద్యార్థులున్న చోట నలుగురు, 58 మంది ఉన్నచోట ఐదుగురు, 41 మంది ఉన్నచోట నలుగురు, 52 మంది ఉన్నచోట ఐదుగురు టీచర్లు కొనసాగుతున్నారు. దీని వెనక పైరవీల రాజ్యం నడిచినట్టు ఆరోపణలున్నాయి.
ఖమ్మం జిల్లాలో సర్దుబాటు చేసేందుకు ఏకంగా అడిషనల్ కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. విద్యాశాఖ లెక్కల ప్రకారం 100 మందిని సర్దుబాటు చేస్తే సరిపోతుంది. కానీ ఈ జిల్లాలో 300 మందిని సర్దుబాటు చేయాల్సి ఉంటుందని అధికారులు తేల్చారు. దీంతో ఆ జిల్లా అడిషనల్ కలెక్టర్ సర్దుబాటును చేతుల్లోకి తీసుకున్నారు. ఎంఈవోల ద్వారా టీచర్ల కొరత, మిగులు టీచర్ల వివరాలను లిఖితపూర్వకంగా తెప్పించుకున్నారు. తప్పుడు వివరాలకు ఎంఈవోలే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఆ బడుల్లో విద్యార్థులున్నారా? లేదా అని స్వయంగా పరిశీలిస్తానని ప్రకటించారు. దీంతో ఈ జిల్లాలో ఇంకా సర్దుబాటు పూర్తికాలేదు.
విద్యార్థులున్న చోట టీచర్లుండరు.. టీచర్లున్న చోట విద్యార్థులుండరు ఇది రాష్ట్రంలోని సర్కారు బడుల పరిస్థితి. టీచర్లను సర్దుబాటు చేసినా మళ్లీ పాతకథే పునరావృతమయ్యింది. టీచర్లుంటే పిల్లల్లేరు.. పిల్లలుంటే టీచర్లు లేరు అన్నట్టుగా పరిస్థితి తయారయ్యింది. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఎన్రోల్మెంట్, విద్యార్థుల సంఖ్య విషయంలో పారదర్శకత లోపించింది.
పేరుకు మాత్రమే రిజిస్టర్లో విద్యార్థుల పేర్లుంటాయి. కానీ ఆ విద్యార్థులు బడికి రారు. సమీపంలోని మరో బడిలో ఉంటారు. ఇలాంటి స్కూళ్లు అనేకం ఉన్నాయి. ఒకే విద్యార్థిని అటూ ప్రైవేట్‌లో, ఇటూ సర్కారు బడిలో చూపిస్తున్న స్కూళ్లు కూడా ఉన్నాయి. దీంతో ఎన్రోల్మెంట్ కాకిలెక్కల చందాన్ని తలపిస్తున్నది. ఏఐ కాలంలోనూ విద్యాశాఖ ఆన్లైన్ అడ్మిషన్ల వైపు దిశగా అడుగులేయడంలేదు. ఆధార్‌కార్డుతో అనుసంధానించేందుకు ప్రయత్నిస్తున్నా.. ఆధార్కార్డులేదని, ఇతరాత్ర కారణాలతో దాటవేస్తూ, కాలం గడుపుతున్నారు.
మిగులు టీచర్ల సర్దుబాటు బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించారు. వారి నేతృత్వంలోనే ఈ ప్రక్రియంతా పూర్తిచేయాలన్నారు. బడుల్లోని విద్యార్థుల సంఖ్య, కొత్త అడ్మిషన్లను ప్రామాణికంగా తీసుకుని సర్దుబాటు పూర్తిచేయాలన్నారు. తొలుత జూన్ 13లోపే సర్దుబాటు పూర్తిచేయాలని చెప్పగా, ఆ తర్వాత జూలై 15కి పొడిగించారు. మొత్తంగా జూలై 22లోపు సర్దుబాటు నివేదికను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు సమర్పించాలని ఆదేశించారు.ఇచ్చిన గడువు జూలై 22తో ముగిసింది. కానీ చాలా జిల్లాల నుంచి నివేదికలు డైరెక్టర్‌కు అందలేదు. సర్దుబాటు నివేదికలను ఆమోదించేందుకు కలెక్టర్లు ససేమిరా అంటున్నారట.