Gudumba | హైదరాబాద్, జనవరి 15 (నమస్తే తెలంగాణ) : రాష్ర్టాన్ని గుడుంబారహితంగా తీర్చిదిద్దేందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిం ది. గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపింది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో నాటుసారా మళ్లీ తయారు చేస్తున్నట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ గుర్తించింది. దానిని పూర్తిస్థాయిలో నిర్మూలించేందు కు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. 13 జిల్లాల్లోని 25 మండలాల పరిధిలో మళ్లీ నాటుసారా తయారవుతున్నట్టు సమాచారముందని తెలిపారు.
నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు ప్రభావిత జిల్లాల్లో ఆకస్మిక దాడులు చేపట్టాలని ఎక్సైజ్ స్టేషన్ల అధికారులను ఆదేశించారు. నాటుసారా తయారీ, రవాణా, అమ్మకాలతో పాటు ముడిసరుకు సరఫరా చేసేవాళ్ల సమాచారాన్ని కూడా సేకరించాలని పేర్కొన్నారు. ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. చెన్నూర్, లక్షెట్ట్టిపేట, మహబూబ్‌నగర్, బెల్లంపల్లి, వనపర్తి, కొత్తకోట, అచ్చంపేట, తెలకపల్లి, కల్వకుర్తి, పరకాల, నర్సంపేట్, వర్ధన్నపేట, తొర్రూర్, గూడేరు, ములుగు, కాటారం, భూపాలపల్లి, దేవరకొండ, భద్రాచలం, సుల్తానాబాద్, ధర్మపురి, నిర్మల్ ప్రాంతాల్లో దాడులు నిర్వహించాలని అదేశాలు జారీ చేశారు.