హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్‌కు నిర్మాణరంగం అత్యంత కీలక పాత్రను పోషించింది. పదేండ్ల పాటు శరవేగంగా పెరిగిన ధరలు, అమ్మకాలు, కొనుగోళ్లతో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించిన నగర మార్కెట్‌పై పడుతున్న ప్రతికూల ప్రభావం ప్రమాదకరంగా మారుతున్నది. గడిచిన రెండేండ్లుగా నిర్మాణరంగాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా అడుగులు వేసి, హైడ్రాతో భయాందోళనలు సృష్టించింది. దీంతో ఇప్పటికీ కోలుకోలేని చావుదెబ్బ కొట్టినట్టు మారడంతో అమ్మకాలు స్తంభించిపోయాయి. ఇక గడిచిన ఆరు నెలలుగా అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఇబ్బందులతో నిర్మాణరంగ ముడిసరుకుల ధరలు శరవేగంగా పెరుగుతున్నాయి.
దీంతో కొన్నేండ్ల కిందట వరకు కళకళలాడిన సిటీ రియల్ ఎస్టేట్ మార్కెట్ కుడితిలో పడిన ఎలుకల్లా కొట్టుమిట్టాడున్నది. ప్రపంచీకరణ ప్రభావమో? కాంగ్రెస్ పాలనా వైఫల్యమో తెలియదు గానీ హైదరాబాద్ నిర్మాణరంగాన్ని పుట్‌బాల్ ఆడుతున్నాయి. ఓ వైపు పశ్చిమాసియాలో నెలకొని ఉన్న యుద్ధ సంక్షోభ పరిస్థితుల సెగ నగరాన్ని తాకుతున్నది. సముద్ర మార్గంలో హొర్ముజ్ జలసంధిని మూసివేయడంతో రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ముఖ్యంగా ఇంటికి వేసే రంగులు, టైల్స్, ఎలక్ట్రికల్ వస్తువులకు వినియోగించే ముడి పదార్థాల దిగుమతి ఆగిపోయింది. దీంతో ఒక్క ఏడాదిలోనే ధరలకు మధ్య వ్యత్యాసం తారస్థాయిలో ఉన్నది.
ప్రస్తుతం నగరంలో చదరపు గజానికి సగటున 1800-2వేలు నిర్మాణ ఖర్చవుతున్నది. ముడిసరుకు కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు రాకెట్ వేగంతో పెరుగుతున్న ధరలతో నగరంలో నిర్మాణరంగమే భయపడిపోతున్నది. యుద్ధం కారణంగా కీలకమైన సిమెంట్, ఇనుము, అల్యూమినియం, కాపర్, ఎలక్ట్రికల్ వైరింగ్, టైల్స్, ఇంటికి వేసే రంగులన్నీ కూడా నిరుటి కంటే 25-35శాతం పెరిగాయి. ఇలా ఒకప్పుడు హైదరాబాద్ కేంద్రంగా మార్కెట్ శరవేగంతో దూసుకుపోయిన రియల్ మార్కెట్‌కు చక్రం విరిగిన రథంలా కుప్పకూలిపోయింది. అంతర్జాతీయంగా యుద్ధం వల్ల పెరిగిన రవాణా ఖర్చులు, దేశీయంగా ముడిసరుకు ధరలను విపరీతంగా పెంచుతున్నాయి. నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.400-600 అదనపు భారం పడుతున్నది. దీనికి తోడు స్థానికంగా రాజకీయ అస్థిరత, హైడ్రా భయం నుంచి బయటపడని మార్కెట్‌కు పంటి కింద రాయిలా మారింది. దీంతో నిరుడు ఉన్న ధరలతో పోల్చితే, పెరిగిన ముడిసరుకు ధరలతో ప్లాట్ల ధరలు ప్రభావితం అవుతున్నాయి. ఈ కారణంగానే బిల్డర్లపై పడే అదనపు భారాన్ని కొనుగోలుదారులపైకి మళ్లించాల్సి వస్తుందని మణికొండకు చెందిన ఓ బిల్డర్ వివరించారు. సగటున ఒక్కో ఫ్లాట్ ధరపై నిరుటి కంటే రూ.5-10లక్షల వ్యత్యాసం వస్తున్నదనీ, ఇందులో బిల్డింగ్ మెటీరియల్‌తోనే జరిగిందని చెబుతున్నారు.
నిజానికి యుద్ధం ఎక్కడో జరుగుతున్నా దాని సెగ హైదరాబాద్ నిర్మాణ రంగాన్ని తగులుతున్నది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించాల్సిన సర్కార్.. హైడ్రా వంటి నిర్ణయాలతో మరింత సంక్షోభంలోకి నెట్టడం దురదృష్టకరమని, ఇప్పటికైనా మొండివైఖరి వీడి, నిర్మాణ రంగానికి ఊతమిచ్చే చర్యలు తీసుకోవాల్సిన అవసరమున్నది. కానీ ప్రభుత్వం మాత్రం కుదేలవుతున్న రంగానికి తులసి నీళ్లు కూడా పోసే పరిస్థితి లేదని ఉప్పల్‌కు చెందిన సాధారణ బిల్డర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇంధన వనరుల కొరత పేరిట కొందరు ఇసుక, ఇటుక, ఇతర ముడి సరుకు రవాణా ఖర్చులను పెంచుతున్నారని, ఇది కూడా భవన నిర్మాణరంగంపై పరోక్షంగా ప్రభావం చూపుతుందంటున్నారు వ్యాపారులు.
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చీరాగానే హైదరాబాద్ నిర్మాణరంగానికి అసలైన గ్రహణం పట్టిందని కొందరు బిల్డర్లు అభిప్రాయపడుతున్నారు. విధానపరమైన లోపంతో, చేసిన తప్పులను సవరించుకోలేని ప్రభుత్వ పెద్దలు.. మార్కెట్‌ను చిన్నాభిన్నాం చేస్తున్నారని మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే చెరువుల పరిరక్షణ పేరిట రాత్రికి రాత్రే జేసీబీలతో కూల్చేసిన తీరు.. ఇప్పటికీ సామాన్యుడిని కలవరపెడుతూనే ఉన్నది. అన్ని అనుమతులు ఉన్నా, ఎప్పుడు ఏ భవనంపై హైడ్రా కన్ను పడుతుందోననే భయం అటు బిల్డర్లను, ఇటూ కొనుగోలుదారులను వెంటాడుతున్నది. తెలంగాణ వస్తే రియల్ ఎస్టేట్ పెరిగినా, ఆ తర్వాత కాంగ్రెస్ పాలన శాపంగా మారింది. గత బీఆర్ఎస్ హయాంలో సులభతరమైన అనుమతులు, పారదర్శక విధానాలతో మార్కెట్‌కు ఊతమిచ్చింది. కానీ నేడు తీవ్ర అయోమయంలో పడింది. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో జాప్యం, క్షేత్రస్థాయిలో పాలకుల వేధింపులు, హైడ్రా భయం.. వెరసి రాష్ర్టానికి రావాల్సిన పెట్టుబడులు కూడా ప్రభావితం అవుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నుంచి పక్క రాష్ర్టాలకు మళ్లిపోతుండగా నిరుటితో పోలిస్తే హైదరాబాద్‌లో కొత్త ప్రాజెక్టుల లాంచింగ్లూ దాదాపు 30శాతం తగ్గాయంటేనే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక నిర్మాణరంగాన్ని చిన్నాభిన్నం చేసిన హైడ్రా విధ్వంసానికి మారుపేరుగా నిలిచింది.
