Telangana | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ప్రాజెక్టుల నిర్మాణంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర అలసత్వం వహిస్తున్నది. దాదాపు 48 శాతం కేంద్ర ప్రాజెక్టులో వాటి నిర్మాణానికి పెట్టుకొన్న డైడ్‌లైన్‌ను ఇప్పటికే దాటిపోయాయి. బీజేపీ సర్కారు ఉదాసీనత కారణంగా ఖజానాపై రూ.5 లక్షల కోట్ల మేర అదనపు భారం పడుతున్నది. దేశ ప్రజల సొమ్మును ఈ విధంగా వృథా చేయడంపై మోదీ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
గత తొమ్మిదిన్నరేండ్ల కాలంలో కేంద్రం పరిధిలోని రూ.150 కోట్ల పైబడిన 1,763 మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో 842 ప్రాజెక్టుల నిర్మాణం నత్తనడకన సాగుతున్నది. ఇప్పటికే గడువు పూర్తయినప్పటికీ, వీటి నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. దీంతో రూ.4.77 లక్షల కోట్ల ప్రజాధనాన్ని అదనంగా వెచ్చించాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ మేరకు కేంద్ర గణాంకాల శాఖ తాజా నివేదికలో వెల్లడించింది. 1,763 ప్రాజెక్టుల నిర్మాణం కోసం వాస్తవానికి రూ.24.86 లక్షల కోట్లు వెచ్చించాల్సి ఉన్నది. అయితే, గడువు ముగిసిన కారణంగా వీటి వ్యయం రూ.29.64 లక్షల కోట్లకు చేరుకొన్నట్టు నివేదిక వెల్లడించింది. గడువు దాటిన ప్రాజెక్టుల్లో ఎక్కువ శాతం ప్రాజెక్టులు రోడ్లు, హైవే మంత్రిత్వ శాఖ పరిధిలోనివి కాగా, అదనపు వ్యయం ఎక్కువగా చెల్లించాల్సిన ప్రాజెక్టులు రైల్వే శాఖ పరిధిలోనివిగా ఉన్నాయి.
తెలంగాణలో సకాలంలో ప్రాజెక్టుల నిర్మాణం
చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. గడిచిన తొమ్మిదిన్నరేండ్ల కాలంలో 3 భారీ ప్రాజెక్టుల నిర్మాణ పనులను నిర్మించడం విశేషం. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా పేరుగాంచిన కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడేండ్ల వ్యవధిలోనే పూర్తి చేశారు. నిపుణుల అంచనా ప్రకారం.. కాళేశ్వరం ప్రాజెక్టును ఇప్పటి వరకూ పూర్తిచేయకపోతే, ప్రస్తుతం పెరిగిన స్టీల్, డీజిల్, సిమెంట్, ఇసుక, భూమి ధరల కారణంగా ప్రాజెక్టు వ్యయం మూడు రెట్లు పెరిగేది.
ఇక, ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 2015లో చేపట్టింది. కోర్టు కేసులు, కరోనా నేపథ్యంలో ప్రాజెక్టు పనులు దాదాపు 4 ఏండ్లకు పైగా నిలిచిపోయాయి. అయినప్పటికీ, యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పనులను ఓ కొలిక్కి తీసుకొచ్చిన బీఆర్ఎస్ సర్కార్.. ఇటీవలే ప్రాజెక్టు వెట్ రన్‌ను ప్రారంభించి, అంజనగిరి రిజర్వాయర్‌ను నింపింది. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం సమీకృత సీతారామ ప్రాజెక్టును చేపట్టింది. సీతమ్మ సాగర్ బరాజ్ నిర్మాణం కొనసాగుతుండగా, ఎత్తిపోతలకు సంబంధించి నిర్మాణ పనులు తుది దశకు చేరుకొన్నాయి. ఉమ్మడి రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యంతో దశాబ్దాలుగా పెండింగ్‌లోనే ఉండిపోయిన కృష్ణా, గోదావరి బేసిన్‌లోని పలు ప్రాజెక్టులను కూడా కేసీఆర్ ప్రభుత్వం రికార్డు సమయంలో పూర్తిచేస్తున్నది.

అన్నింటా మధ్యప్రదేశ్ అట్టర్‌ఫ్లాప్ అన్ని ర్యాంకుల్లో తెలంగాణ కంటే వెనుకే
మధ్యప్రదేశ్‌లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వ పని తీరు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే విధంగా మారాయి. ప్రభుత్వ వైఫల్యాలు ప్రతిపక్షాలకు ఎన్నికల ఆయుధాలుగా మారాయి. దేశంలోని మిగతా రాష్ర్టాలతో పోలిస్తే ఆర్థిక, సామాజిక, పర్యావరణ రంగాల సూచీల్లో మధ్యప్రదేశ్ అట్టడుగు స్థానంలో ఉన్నది. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ చాలా రంగాల్లో మెరుగైన ఫలితాలతో అగ్రభాగాన నిలుస్తున్నది. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్థిక సర్వే నివేదిక స్పష్టంగా చెబుతున్నది. అదేవిధంగా మధ్యప్రదేశ్ ఆర్థిక సర్వే ఆ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎంత అధ్వానంగా ఉందో చెప్పకనే చెబుతున్నది. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారుంటే అభివృధ్ధి పరుగులు పెడుతుందని చెప్పుకునే బీజేపీ నేతలు దీనికి ఏం సమాధానం చెబుతారని మధ్యప్రదేశ్ ప్రజలు నిలదీస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.
