హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఏ ముహుర్తాన అధికారం చేపట్టిందో తెలియదు కానీ, పది నెలల పాలనలో ఏ ఒక్క పనిని సక్రమంగా చేయడం లేదు. ఇల్లు అలకగానే పండగ కాదనే తత్వం ఆ పార్టీకి ఇప్పుడిప్పుడే బోధపడుతున్నది. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఉద్యమిం చాల్సిన దుస్థితి నెలకొన్నది. కాగా, పేదలకు సొంతింటి కలను నిజం చేస్తామని ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేర్చలేక అపసోపాలు పడుతున్నది. అందుకు తాజా ఉదాహరణ ఇందిరమ్మ ఇండ్లు.
ఇందిరమ్మ ఇల్లు(Indiramma houses) కట్టిస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తొలిదశలోనే ఎదురుదెబ్బ తగిలింది. దీపావళి నుంచి ఇందిరమ్మ పథకం కింద ఎంపికైన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలకు ముగ్గుపోయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఇందిరమ్మ కమిటీలు కూడా ఏర్పాటు చేయలేక ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
ఈ నెల 11వ తేదీలోపు కమిటీల నియామక ప్రక్రియ పూర్తికావాల్సి ఉన్నా.. అధికార పార్టీ నేతల మధ్య సమన్వయలోపం, అధికారుల అవగాహన రాహిత్యంతో ఇప్పటికీ కమిటీలు ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. ప్రభుత్వం ఓ వైపు దీపావళి నుంచి ఇందిరమ్మ పథకం కింద ఎంపికైన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలకు ముగ్గుపోయాలని నిర్ణయించగా.. జిల్లాల్లో మాత్రం ఈ ప్రక్రియ ప్రారంభం జాప్యం జరిగే అవకాశాలున్నాయి.