సూర్యాపేట : జిల్లా కేంద్రంలో సకల సౌకర్యాలతో బ్రాహ్మణ అపర కర్మశాలను నిర్మిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అందుకు గాను ఇప్పటికే 800 గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి సీఎం కేసీఆర్ సహాయ నిధి నుంచి రూ. 20 లక్షలు మంజూరు చేయించినట్లు ఆయన వెల్లడించారు. సూర్యాపేటలో నూతనంగా నిర్మించ తల పెట్టిన బ్రాహ్మణ అపర కర్మశాల భవన సముదాయానికి సోమవారం మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్నానపు ఘట్టాలు, భోజన శాలలతో పాటు వారి ఆచార వ్యవహారాలు ఉట్టి పడేలా అపర కర్మశాల నిర్మాణం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే తెలంగాణ ప్రాంతంలో బ్రాహ్మణులకు ఆదరణ పెరిగిందన్నారు. శిథిలావస్థకు చేరుకున్న దేవాలయాల్లో దీప దూప నైవేద్యాలు పునరుద్ధరించడమే కాకుండా పూజారులకు గౌరవ వేతనం ఇచ్చి గౌరవించింది సీఎం కేసీఆర్ అని ఆయన గుర్తు చేశారు.
అంతే కాకుండా హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో విలీనం అయినప్పటి నుంచి కృష్ణా, గోదావరి పుష్కరాలు అంటేనే ఇటు విజయవాడ, అటు రాజమండ్రి అన్నట్లు అప్పటి పాలకులు నిర్దేశించారన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉద్యమ నేత కేసీఆర్ వారి మోసాలను గుర్తించి అధికారంలోకి వచ్చిందే తడవుగా తెలంగాణలోనే కృష్ణా,గోదావరి పుష్కరాలు నిర్వహించారు.
అంతేకాకుండా ఆయా పుష్కరాలలో బ్రహ్మణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద పీట వేశారని మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, బ్రాహ్మణ సమాజం ప్రతినిధులు డాక్టర్ రామయ్య, డాక్టర్ రమేష్, చకిలం రాజేశ్వరరావు, కట్టెకోల పూర్ణ చందర్ రావు, శంకర మూర్తి, సుబ్రమణ్య శాస్త్రి, యం. వి.డి ప్రసాద రావు, మురళీధరా చార్యులు, వరదాచార్యులు, ఎల్లంబట్ల రమేష్, టేకులపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.