కొడంగల్, జూన్ 4: వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అప్పాయిపల్లిలో ప్రభుత్వం వైద్య కళాశాల నిర్మాణం కోసం సర్వే నంబర్ 19లో పోలీసుల పహారా మధ్య ప్రహరీ పనులు కొనసాగుతున్నాయి. వారం రోజుల క్రితం గ్రామస్థులు ప్రహరీ పనులు అడ్డుకొని శ్మశాన వాటిక కోసం ఐదు ఎకరాలు కేటాయించాలని ఆందోళనకు దిగడంతో పోలీసులు కల్పించుకుని రెండు, మూడు రోజుల్లో ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దాంతో గ్రామస్థులు ఆందోళన విరమించి వెళ్లిపోయారు. కాగా బుధవారం పోలీసులను భారీగా మోహరించి వైద్య కళాశాల ప్రహరీ నిర్మాణం చేపట్టారు. శ్మశాన వాటికకు స్థలం కేటాయించకుండానే నిర్మాణ పనులు చేపడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఉన్న శ్మశాన వాటిక స్థలం తక్కువ ఉండటంతో మరికొంత స్థలం కావాలని స్థానికులు కోరుతున్నారు.