మహబూబ్‌నగర్ ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో నిర్మాణ సంస్థ కంపెనీ ప్రతినిధి కోసం కేవలం పది గంటల్లోనే హెలిప్యాడ్‌ను సిద్ధం చేయడం చర్చనీయాంశంగా మారింది. సొరంగం పనులు చేపడుతున్న కంపెనీ యజమానులు సొంతంగా ఇక్కడ తొలుత ఒక హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ప్రతిరోజూ హెలికాప్టర్లో ఇక్కడకు వస్తున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఇదే హెలిప్యాడ్ వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం నిర్మాణ సంస్థ అధినేత ఇక్కడికి వచ్చారు. అప్పటికే మంత్రి ఉత్తమ్ హెలికాప్టర్ అక్కడ ఆగి ఉన్నది. దీంతో మంత్రి హెలికాప్టర్‌ను టేక్ ఆఫ్ చేయించగా, కంపెనీ యజమాని హెలికాప్టర్ వచ్చి ఆగింది. హెలికాప్టర్ నుంచి యజమాని దిగగానే.. ఆ హెలికాప్టర్ గాల్లోకి లేచింది. అప్పటికే గాల్లో చక్కర్లు కొడుతున్న మంత్రి హెలికాప్టర్ అక్కడికి వచ్చి ల్యాండ్ అయింది. దీంతో కంపెనీ యాజమాన్యం తన కోసం 10 గంటల్లో ఇంకో హెలిప్యాడ్‌ను రెడీ చేసుకున్నది. ప్రమాదం జరిగి ఎనిమిది రోజులైనా చిక్కుకున్నవారి జాడను మాత్రం కనిపెట్టలేకపోయారంటూ స్థానికులు మండిపడుతున్నారు.