న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: వంటనూనెల ధరలు మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రూడ్ వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని 10 శాతం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం మే 31 నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర సర్కార్ విడుదల చేసిన నోటిఫికేషన్లో వెల్లడించింది. ప్రస్తుతం క్రూడ్ పామాయిల్, క్రూడ్ సోయా ఆయిల్, క్రూడ్ సన్‌ఫ్లవర్‌పై 20 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నారు.
దేశీయంగా వినియోగిస్తున్న వంటనూనెల్లో 70 శాతం దిగుమతులపై ఆధారపడుతున్నది. ప్రస్తుతం ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ దేశాల నుంచి అధికంగా పామాయిల్‌ను భారత్ దిగుమతి చేసుకుంటున్నది. అలాగే సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నది.
కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో వంటనూనెల ధరలు మరింత తగ్గనున్నాయని, అలాగే డిమాండ్ కూడా మరింత పెరిగే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. ఈ మూడు చమురులపై మొత్తం దిగుమతి సుంకం 27.5 శాతం నుంచి 16.5 శాతానికి దిగిరానున్నది. సెప్టెంబర్ 2024లో క్రూడ్, రిఫైన్ వంటనూనెలపై కస్టమ్స్ సుంకాన్ని 20 శాతానికి పెంచిన విషయం తెలిసిందే.