KBR Park | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ): కేబీఆర్ పార్కు వద్ద చేపట్టిన మల్టీ లెవల్ పార్కింగ్ పనులు టెండర్ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. పనులు దక్కించుకున్న ఏజెన్సీ స్థల వినియోగంలో అక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తున్నది. జీహెచ్ఎంసీ నుంచి పొందిన స్థలానికి అదనంగా తవ్వకాలు జరపడంతోపాటు ఇప్పటికే ఫుట్‌పాత్‌లపై ఉన్న బస్‌స్టాప్‌లను తొలగించారు. రోడ్డువైపు ఉన్న ఫుట్‌పాత్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తాజాగా రాత్రికి రాత్రే కేబీఆర్ పార్కు బయట జీహెచ్ఎంసీకి చెందిన వాక్‌వేకు రక్షణగా ఉన్న ప్రహరీని కూల్చేశారు. సుమారు 30 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు స్థలాన్ని ఆక్రమించుకున్నట్టు మార్నింగ్ వాకర్స్ ఆరోపిస్తున్నారు.
జీహెచ్ఎంసీ వాక్వేలోని స్థలాన్ని కాపాడాల్సిన యూబీడీ, ఇంజినీరింగ్ విభాగం అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారికంగా పార్కింగ్ స్థలం కోసం జీహెచ్ఎంసీ నుంచి 484 గజాల స్థలాన్ని తొలుత 10 ఏండ్లు ఆ తర్వాత ఫలితాలను బట్టి మరో ఐదేండ్లపాటు లీజుకు దక్కించుకున్న నవ నిర్మాణ్ అసోసియేట్స్ సుమారు 1000 నుంచి 1500 గజాల స్థలాన్ని కాజేసేందుకు ప్రణాళిక రచిస్తున్నదని, ఇటీవల నమస్తే తెలంగాణ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ క్రమంలోనే గడిచిన రెండ్రోజులుగా రాత్రిపూట జీహెచ్ఎంసీ వాక్‌వేకు చెందిన ప్రహరీని కూల్చేసి స్థలాన్ని కబ్జా చేయడం విస్మయానికి గురిచేస్తున్నది.
ఇదిలా ఉండగా మొదట వేసిన ప్లాన్‌ను పక్కనబెట్టి మరింత ఎక్కువ స్థలంలో ర్యాంప్ నిర్మాణం కోసం కొత్తగా పార్కింగ్ స్థలంలో గుంతలు తవ్వుతున్నారు. దీంతో మరో 100 గజాల స్థలాన్ని అదనంగా కలుపుకుంటున్నారని తెలుస్తున్నది. ఇక పార్కింగ్ స్థలంలో ఉన్న ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్‌ను నిరుపయోగంగా మార్చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద కేబీఆర్ పార్కు బయట నిర్మిస్తున్న మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్‌పై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఖరీదైన స్థలాన్ని కొట్టేస్తున్నారని వాకర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా ఏర్పాటుచేసిన లూ కేఫ్‌ను కూడా తరలించనున్నట్టు వినికిడి. టెండర్ల ప్రక్రియ నుంచి పనుల దాకా సంబంధిత ఏజెన్సీకి అధికారులు కొమ్ముకాస్తున్నానే ఆరోపణలున్నాయి. కమిషనర్ జోక్యం చేసుకోవాలని వాకర్లు కోరుతున్నారు.