సూర్యాపేట : బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే దేశానికి శ్రీరామ రక్ష అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు. జ్ఞానానికి, మేధస్సుకు సింబల్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని ప్రశంసించారు. శుక్రవారం అంబేద్కర్ జయంతి(Ambedkar Jayanthi) సందర్భంగా సూర్యాపేట(Suryapeta)లో అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. అంబేద్కర్ స్ఫూర్తి ని శాశ్వతం గా ఉంచడానికే సీఎం కేసీఆర్(CM KCR) తెలంగాణ సచివాలయాని(Telangana Secretariat)కి అంబేద్కర్ పేరు పెట్టడమే కాకుండా ఆ మహనీయుని 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని రాజధాని నడిబొడ్డున ఏర్పాటు చేయించారని పేర్కొన్నారు. బాబా సాహెబ్ ఆలోచనలను అమలుచేయడమే మనం ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని అన్నారు.
ఆర్థిక, సామాజిక సమానత్వం కోసం అంబేద్కర్ కట్టుబడి ఉన్న తీరు ప్రజాస్వామ్యానికి వెన్నుముకగా నిలుస్తుందని అన్నారు. అనంతరం ప్రభుత్వ రంగం లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను మంత్రి సత్కరించి, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమం లో అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గొపగానీ వెంకట్ నారాయణ గౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ అన్నపూర్ణమ్మ, చివ్వెంల ఎంపీపీ కుమారి బాబు నాయక్, జడ్పీటీసీ సంజీవ నాయక్, కౌన్సిలర్లు జ్యోతి శ్రీ విద్య తదితరులు పాల్గొన్నారు.