PC Results | సిర్గాపూర్/బయ్యారం/వర్ధన్నపేట/నర్సంపేట రూరల్/చెన్నారావుపేట/నిజాంపేట, అక్టోబర్ 5: రాష్ట్రంలో బుధవారం విడుదలైన కానిస్టేబుల్ ఫలితాలు కొన్ని కుటుంబాల్లో ముందే దసరా పండుగను తీసుకొచ్చాయి. రెండు కుటుంబంలో నలుగురికి, మరో రెండు కుటుంబంలో ముగ్గురికి కానిస్టేబుల్ ఉద్యోగాలు దక్కాయి. కొత్తగా వివాహమైన దంపతులు, అన్నదమ్ములు సైతం పోలీస్ కొలువులు సాధించారు.
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం జమ్లాతండా గ్రామానికి చెందిన మెగావత్ నెహ్రూనాయక్ మారోనిబాయి దంపతుల కుమారులు రమేశ్, సంతోష్, కూతురు రేణుక, కోడలు మలోత్ రోజా కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు. సంతోష్, రోజా ఏఆర్ కానిస్టేబుల్‌గా, రమేశ్ టీఎస్పీఎస్, రేణుక సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కోకల్దాస్తండాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బర్దావల్ రాష్ర్టాబాయి, బర్దావల్ మహిందర్, బర్దావల్ రాజేందర్, యశ్వంత్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
మహబూబాబాద్ జిల్లా చింతోనిగుంపు గ్రామానికి చెందిన వంగ సోమనర్సయ్య-మల్లమ్మ ఇద్దరు కొడుకులతోపాటు కోడలు కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నందిగామకు చెందిన సంగు లక్ష్మి, దుర్గయ్య దంపతుల ముగ్గురు కుమారులు కొలువులు సాధించారు. కామారెడ్డి మద్నూర్ మండలంలోని శేఖాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములకు ఉద్యోగాలు వరించాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని కడారిగూడెం గ్రామానికి చెందిన కట్కూరి అశోక్‌రెడ్డికి ముగ్గురు కుమారులు లక్ష్మణ్‌రెడ్డి, రాంరెడ్డి, సంపత్‌రెడ్డి కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఖాదర్‌పేటకు చెందిన పెంతల రాజేందర్-కల్పన దంపతులు సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని జమ్లాతండా జీపీలోని తోల్యాతండాకు చెందిన ఆలుమగలు రాథోడ్ రాజు స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్‌గా, వడిత్య సక్కుబాయి ఏఆర్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డికి చెందిన కొత్తజంట సురేశ్, శిరీష (గురువారం వివాహమైంది) ఖాకీ కొలువులు సాధించారు. సిరికొండ మండలం రావుట్ల గ్రామానికి చెందిన భార్యభర్తలు సుమన్, సౌమ్య, మైలారం గ్రామానికి చెందిన అన్నదమ్ములు గిరిధర్, వాల్మీకి కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికయ్యారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం కమ్మపల్లికి చెందిన చిలువేరు రమ-రవి దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి ముగ్గురు పిల్లలు. రెండో కుమారుడు శ్రీకాంత్ జైల్ కానిస్టేబుల్‌గా, కుమార్తె వినీత సివిల్ కానిస్టేబుల్గాఎంపికయ్యారు.