(స్పెషల్ టాస్క్బ్యూరో, నమస్తే తెలంగాణ) : వారిది నిరుపేద మైనార్టీ కుటుంబం.. ఎవరూ పెద్దగా చదువుకోలేదు.. మాఫీ ఇనాంగా వచ్చిన భూమిని కౌలుకు ఇచ్చి ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస పోయారు.. ధరలు పెరగడంతో ఆ భూములపై ఓ రియల్టర్ కన్నుపడింది.. సదరు నిరుపేద మైనార్టీల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వారితో అనధికార ఒప్పందం చేసుకున్నాడు. కేవలం రూ.50 లక్షలు ముట్టజెప్పి 54 ఎకరాలకు పైగా భూమిని చెరపట్టాడు. అధికారుల్లో చక్రం తిప్పి ఓఆర్సీ తెస్తానని చెప్పి ఒకటీ రెండు కాదు.. దాదాపు ఆరేండ్లుగా ముఖం చాటేస్తున్నాడు. ఇదేమని ప్రశ్నిస్తే.. లాయర్ నోటీసులతో సదరు కుటుంబాన్ని బెదిరిస్తున్నాడు.. మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజ్‌పేట శివారులోని 90 ఎకరాల భూ యజమానుల వ్యథ ఇది. ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచక ఆ కుటుంబం అల్లాడిపోతున్నది.
మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజ్‌పేట గ్రామ శివారులోని సర్వేనంబర్ 229/ఎ, 230/ఎ, 231/ఎఎల్లో సుమారు 90 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూములు ఇదే గ్రామానికి చెందిన మహ్మద్ రవూఫ్, మహ్మద్ ఆసిఫ్, మహ్మద్ ముదాసర్, మహ్మద్ ముక్రంతో పాటు వారి కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్నది. 90 ఎకరాల్లో 40 ఎకరాల వరకు వక్ఫ్(దర్గా) భూములు ఉండగా.. మిగిలినవి ఇనాం భూములు. 231(అ)లో 27.18 ఎకరాలు, 231(ఆ)లో 27.18 కలిపి మొత్తం 54.36 ఎకరాలు ఉన్నది. ఈ నిరుపేద మైనార్టీ కుటుంబం భూములను చాలా ఏండ్లుగా కౌలుకు ఇచ్చి హైదరాబాద్‌లో వివిధ రకాల పనులు చేసుకుంటూ జీవిస్తున్నది. ఈ భూముల్లో సుమారు 20 మందికి పైగా కౌలు రైతులు సేద్యం చేస్తున్నారు. బోర్లు వేసుకొని వరి, మక్క పండిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జాతీయ రహదారి వెంట ఉన్న చేగుంట, తూప్రాన్, రామాయంపేట పరిసర ప్రాంతాల భూముల ధరలకు రెక్కలొచ్చాయి. తూప్రాన్, చేగుంట, చిన్నశంకరంపేట మండలాల్లో కంపెనీలు కూడా పెరిగాయి. దీంతో అక్కడి భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ క్రమంలో ఓ రియల్టర్ కన్ను ఈ భూములపై పడింది.
సుమారు ఆరేండ్ల కింద మైనార్టీ కుటుంబాన్ని కలిసిన నర్సింహారెడ్డి అనే రియల్టర్ వారితో అనధికార ఒప్పందం చేసుకున్నాడు. ఎకరా రూ.25 లక్షల చొప్పున మాట్లాడుకొని కేవలం రూ.50 లక్షలు అడ్వాన్సుగా ఇచ్చాడు. కటుంబ సభ్యులందరితో సేల్ డీడ్‌పై సంతకాలు చేయించుకున్నట్టు తెలిసింది. సర్వే నంబర్ 231(అ), (ఆ)ల్లోని 54.34 ఎకరాలతో పాటు వక్ఫ్ బోర్డుకు చెందిన 40 ఎకరాలను కూడా చేర్చి అగ్రిమెంట్ చేయించుకున్నట్టు సమాచారం. ఈ భూములన్నింటికీ ఓఆర్సీ (ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్) ఇప్పిస్తానని, తర్వాత తన పేరిట అధికారికంగా సేల్‌డీడ్ చేయాలని డీ కార్తీక్‌రెడ్డి, తండ్రి నర్సింహారెడ్డి పేరిట అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ విషయం కౌలు రైతులకు తెలియడంతో ఎన్నో ఏండ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూముల్లోకి రియల్టర్ వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. దీంతో సదరు రియల్టర్ రైతుల వారసులను పిలిపించుకొని వారి ఆధార్ కార్డులు తీసుకొని సంతకాలు చేయించుకుని, తలా రూ.లక్ష చేతిలో పెట్టినట్టు తెలిసింది. ఈ మొత్తాన్ని చెక్కుల రూపంలోనే ఇవ్వడం గమనార్హం.
వాస్తవానికి మైనార్టీ కుటుంబసభ్యుల పేర్లు రెవెన్యూ రికార్డుల్లో ఆదినుంచీ నమోదయ్యాయి. మాఫీ ఇనాం భూములకు సంబంధించి వారికి ఓఆర్సీ కూడా వచ్చే అవకాశాలున్నాయి. కానీ ఇవేవీ తెలియని వాళు ్లరియల్టర్ మాయ మాటలకు మోసపోయి అనధికారిక ఒప్పందంపై సంతకాలు పెట్టారు. దీంతో ఆరేండ్లుగా అటు ఓఆర్సీలు ఇప్పించకుండా.. ఇటు ఒప్పందాన్ని రద్దుచేయకుండా తమను నానా ఇబ్బందులు పెడుతున్నాడని నిరుపేద కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ఆ ఒప్పందంపై తేదీ వేయకుండా రియల్టర్ తమను ఇబ్బంది పెడుతున్నాడని చెప్తున్నది. ఇచ్చిన డబ్బును వాపస్ ఇస్తామన్నా కుదరదంటూ న్యాయవాదితో నోటీసులు పంపి బెదిరిస్తున్నాడని ఆ కుటుంబం వాపోతున్నది.
నేను 70 ఏండ్లుగా ఈ భూమిలో సాగు చేస్తున్న. మా తాతల నుంచి ఈ భూమిలోనే పండించుకొని తింటు న్నం. నాకు నాలుగు ఎకరాలు ఉన్నది. ఎకరన్నర పొలంలో మక్కజొన్న పండిస్తున్న. మాఫీ ఇనాం భూమి పట్టా అయితే నా పేరు మీద చేసుకుంటా. హైదరాబాద్‌కు చెందిన నర్సింహారెడ్డి అనే వ్యక్తి నాకు తెల్వకుండానే నా మనవడికి రూ.లక్ష చెక్కు ఇచ్చిండని తెలిసింది. మాకు పైసలు వద్దు.. భూమి కావాలి.
మా తాతలు, అయ్యలు ఈ భూములను సాగు చేసిండ్రు. ఇప్పుడు మేము సాగు చేయవట్టి 50 ఏండ్లు అవుతున్నది. నేను ఐదు ఎకరాల్లో పంటలు పండిస్తున్న. ఇప్పుడు ఎవరో ఓ మనిషి వచ్చి భూమిని తీసుకుంటామంటే ఒప్పుకోం. నాకు తెల్వకుండానే మా కొడుక్కు రూ.లక్ష చెక్కు ఇచ్చిండట!