Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : ‘కుల గణన మాటున బహుజనుల హక్కులను కాలరాసేందుకు కాంగ్రెస్ సర్కార్ స్కెచ్ వేసిందా? మేమెంత మందిమో మాకం త వాటా కావాలని కొట్లాడుతున్న బీసీల జనాభాను తక్కువ చేసి వారి వాటాను కుదించే కుట్ర చేస్తున్నదా? 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని పోరాటం చేస్తున్న బీసీలపై కపట ప్రేమను ఒలకబోస్తూ వారి హక్కులను పాతాళంలోకి తొక్కేసే చీకటి ఎత్తులకు పూనుకున్నదా? తూతూ మంత్రంగా చేసిన కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటు ‘కోర్టు’లోకి బంతిని నెట్టేసి చేతులు దులుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నదా? కేంద్రం లెక్కలు తేల్చలేదనే సాకుతో ఏకంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేసేందుకు ఉపాయం పన్నిందా?’ అంటే, ‘అవును’ అన్న సమాధానమే వినిపిస్తున్నది. రాష్ట్ర మంత్రులు సామాజిక వర్గాల వారీగా విడుదల చేసిన లెక్కలు, అనంతర పరిణామాలను గమనిస్తే తెర వెనుక పెద్ద కుట్రేదో జరుగుతున్నట్టే కనిపిస్తున్నదని బహుజన ప్రజా సంఘాలు అనుమానిస్తున్నాయి.
తీర్మానం చేస్తే బరువు తీరినట్టేనట!
రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ను 42 శాతానికి పెంచుతామని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం 2024 నవంబర్లో కులగణన సర్వే మొదలు పెట్టింది. ఈ సర్వేకు ప్రజలు సహకరించటం లేదని, ప్రజలు తమను తిడుతున్నారని సర్వే కోసం వెళ్లిన ఎన్యుమరేటర్లు మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తంచేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కులగణన వివరాలు ఇవ్వటమనేది ప్రజల ఐచ్ఛికమని, సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్లు మీడియాతో మాట్లాడవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్యుమరేటర్లు తూతూ మంత్రంగా కులగణన చేసినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఉజ్జాయింపు లెక్కలతో కుల సర్వేలో వచ్చిన వివరాలను ముసాయిదా రూపంలో అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అందించారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ కట్టు కథలు, కాకి లెక్కలనే ప్రామాణికంగా తీసుకొని రాష్ట్రంలో బీసీల జనాభా 46.25 శాతమేనని, ముస్లిం బీసీలను కూడా కలుపుకొంటే మొత్తం బీసీ జనాభా 56.33 శాతం మించటం లేదని క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్రెడ్డి ఆదివారం ప్రకటించారని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నివేదికపైనే మంగళవారం రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయి, బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించి, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీల రిజర్వేషన్లపై తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించారని బీసీ సంఘాలు చెప్తున్నాయి.
అసెంబ్లీ తీర్మానం.. ఒడవని కథ
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కుల సర్వేలో వచ్చిన వివరాల ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు సాధ్యం కాదని బీసీ సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటిపోతాయని తెలిసీ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం 27 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉన్నది. ప్రస్తుతం బీసీలకు 23 శాతం రిజర్వేషన్ మాత్రమే అమలయ్యే అవకాశమున్నది. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజరేషన్లు అమలు కావాలంటే కేంద్రం నుంచి ఆమోదం తప్పనిసరి. కేంద్రం అనుమతి కోసం తీర్మానం చేసి పంపుతున్నామని చెప్పి కాంగ్రెస్ నేతలు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని కుల సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాన్ని ఉన్నఫళంగా ఆమోదించి, రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచుకునేందుకు అనుమతించే అధికారం పార్లమెంటుకు కూడా లేదని, ఇందుకోసం పార్లమెంటులో ప్రత్యేక చట్టం చేయాల్సి ఉంటుందని వారు చెప్తున్నారు. కేవలం మూడు, నాలుగు నెలల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపటం, ఆ వెంటనే కేంద్రం ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి చట్టం చేయటం అసాధ్యమని బీసీ నేతలు అంటున్నారు. ఇదే సాకు చూపించి స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసే ఎత్తుగడతోనే అసెంబ్లీ తీర్మానం నాటకం ఆడుతున్నారని బీసీ సంఘం నేతలు చెప్తున్నారు.
బీసీ జనాభాను తగ్గించి.. రిజర్వేషన్లు కుదించే ఎత్తు
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 83 లక్షల ఇండ్లు, 3.5 కోట్ల జనాభా ఉన్నట్టు తేలిందని, 2014లో నాటి సీఎం కేసీఆర్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో 1.03 కోట్ల ఇండ్లు, 3.68 కోట్ల జనాభా అని తేలిందని బీసీ సంఘాల నేతలు తేల్చిచెప్తున్నారు. ఈ లెక్కన నాలుగేండ్ల వ్యవధిలో 20 లక్షల ఇండ్లు,18 లక్షల జనాభా పెరిగిందని, ఈ మేరకు పదేండ్లలో ఎన్ని ఇండ్లు, ఎంత జనాభా పెరిగి ఉండాలని వారు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేసిన సమగ్ర కుల గణనలో కోటీ 15 లక్షల ఇండ్లు ఉన్నాయని, రాష్ట్ర జనాభా 3 కోట్ల 70 లక్షలు అని చెప్తున్నదని, కాలంతో పాటు జనాభా పెరుగుతుందో? తగ్గుతుందో కాంగ్రెస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కుల గణనలో కేవలం ఓసీల జనాభాను పెంచి చూపించి బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభాను తగ్గించి బీసీల రిజర్వేషన్లను కుదించేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని ఆరోపిస్తున్నారు.