హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు జారీచేసే అక్రెడిటేషన్లలో కోత పెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తున్నదని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతిసాగర్ మండిపడ్డారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం మొదట జీవో 252ను తీసుకొచ్చి కార్డుల విషయంలో డెస్క్, బ్యూరో జర్నలిస్టులను వేరుచేయాలని చూసిందని తెలిపారు. ఆ తర్వాత డెస్క్ జర్నలిస్టుల ఆందోళనతో డెస్క్, బ్యూరో జర్నలిస్టులకు ఒకే రకమైన కార్డు ఇస్తామని జీవో 103ను జారీ చేసిందని పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో అప్పటి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ జీవో 239 ద్వారా 23వేలకు పైగా అక్రెడిటేషన్లు ఇస్తే, ప్రస్తుతం ప్రభుత్వం సగానికి సగం తగ్గించేందుకు యత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
నిరుడు ఐఅండ్‌పీఆర్ ద్వారా 44 కేబుల్ చానళ్లకు రాష్ట్రస్థాయిలో 12 కార్డులు ఇచ్చేవారని, ప్రస్తుతం ఆ సంఖ్యను సున్నాకు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. కేబుల్ జర్నలిస్టులకు న్యాయం జరిగేవరకు అవసరమైతే న్యాయపోరాటానికి వెనుకాడబోమని తేల్చిచెప్పారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మల్టీ సిగ్నల్ ఆపరేటర్లు కొన్నిగంటలపాటు కేబుల్ ప్రసారాలను ఆపివేయాలని పిలుపునిచ్చారు. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల నిరంకుశ ధోరణితో పోతుందని, మీడియాతో పెట్టుకున్న ఏ పాలకులు మనుగడ సాగించలేదన్న విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరించారు. ఎంఎస్‌వోల సంఘం అధ్యక్షుడు కోల్ల కిశోర్ మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో జరిగే ఘటనలు, అంశాలు సైతం లోకల్ చానల్ ప్రసారం చేసి ప్రజలకు చేరువ అవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం దిగిరాకుంటే ఒక్కరోజు అన్ని చానళ్ల ప్రసారాలను నిలిపివేసి నిరసన తెలుపుతామని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో నాయకులు వెంకట్, చారి, శివ, భరత్ తదితరులు ఉన్నారు.